Kurnool: కర్నూలులో ఎన్నికల కోడ్ అమల్లోకి కమిషనర్ హెచ్చరిక!

Kurnool: కర్నూలు నగరంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, అనధికార పోస్టర్లు, బ్యానర్లపై చర్యలు తప్పవని కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 14 Oct 2026 5:33 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో ఎన్నికల కోడ్ అమల్లోకి కమిషనర్ హెచ్చరిక!

కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో కర్నూలు నగరంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని అడిషనల్‌ ఎలక్షన్‌ అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

ఎన్నికలకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నగరంలోని కూడళ్లు, డివైడర్లు, స్తంభాలు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, గోడలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడం, వాల్‌ పెయింటింగ్‌లు వేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎన్నికల నియమావళితో పాటు డెఫేస్‌మెంట్స్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ చట్టాల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు ప్రచార బ్యానర్లు ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా నగరపాలక సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. గుర్తింపు పొందిన ప్రకటన సంస్థలు నగరపాలక సంస్థ అనుమతితో ఏర్పాటు చేసిన హోర్డింగులపైనే సంబంధిత అనుమతులు, నిబంధనలకు అనుగుణంగా ప్రకటనలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని చల్లా ఓబులేసు కోరారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL