Kurnool: కర్నూలులో 60 వేల హెక్టార్లకు ఉద్యాన పంటల విస్తరణ లక్ష్యం!
Kurnool: కర్నూలు జిల్లాలో ఉద్యాన పంటల విస్తరణకు రూ.1,642 కోట్లతో 60 వేల హెక్టార్ల లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు.
Kurnool: కర్నూలులో 60 వేల హెక్టార్లకు ఉద్యాన పంటల విస్తరణ లక్ష్యం!
Kurnool: కర్నూలు జిల్లాను ఉద్యాన పంటల సాగుకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసి ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ లక్ష్యాలను సాధించే దిశగా సమగ్ర కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు.
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కార్యక్రమంపై ప్రజలు, రైతులు, విద్యార్థుల్లో విస్తృత అవగాహన కల్పించడంలో భాగంగా బుధవారం ఉదయం కలెక్టరేట్ నుంచి సి-క్యాంప్ రైతు బజార్ వరకు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి రూ.1 లక్ష కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందులో ప్రధానంగా ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంపు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 2వ తేదీన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇందులో భాగంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడంతో పాటు, విద్యార్థులకు జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటలు, ఉద్యాన పంటల ప్రాధాన్యతపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. ఎస్టీబీసీ కళాశాలలో డ్రోన్ షో నిర్వహించి హార్టికల్చర్ హబ్‌పై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. రాయలసీమ రైజింగ్‌లో భాగంగా కర్నూలు జిల్లాకు సుమారు రూ.4,191 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
సాగునీటి రంగానికి సుమారు రూ.2,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న వేదవతి ప్రాజెక్టును ఈ కార్యాచరణలో చేర్చినట్లు తెలిపారు. గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 4.5 టీఎంసీల నుంచి 5.5 టీఎంసీలకు పెంచేందుకు అవసరమైన నిధులు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో కొత్తగా 111 ఎంఐ ట్యాంకుల నిర్మాణానికి అనుమతులు లభించాయని పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 721 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల నిర్మాణానికి అనుమతులు లభించాయని, ఇప్పటికే సుమారు 400 కిలోమీటర్ల రహదారులకు మరమ్మతు పనులు చేపట్టినట్లు వివరించారు.
ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు రూ.1,642 కోట్లతో 60,000 హెక్టార్ల అదనపు విస్తీర్ణాన్ని ఉద్యాన పంటల సాగులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు 15,000 హెక్టార్ల చొప్పున ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచుతూ మూడు నుంచి నాలుగు దశల్లో లక్ష్యాన్ని సాధించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మామిడి, చీని, కమల , తదితర శాశ్వత ఉద్యాన పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం లభించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఉద్యాన పంటల విస్తీర్ణం పెరగడం వల్ల రైతుల ఆదాయంతో పాటు జిల్లాలో తలసరి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. సాగునీటి వసతుల విస్తరణ, ఉద్యాన పంటల సాగు పెంపు, మెరుగైన రహదారి సదుపాయాలు, వ్యవసాయ ఆధారిత ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధితో కర్నూలు జిల్లాను ఉద్యాన పంటల ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రాయలసీమ రైజింగ్‌లో భాగంగా కర్నూలు జిల్లాకు రూ.4,191 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన, సాగునీరు, రహదారుల రంగాల అభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఎస్‌ఈ ఇరిగేషన్ శైలేశ్వర్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ చంద్రారెడ్డి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఏడీ హార్టికల్చర్ రాజకృష్ణారెడ్డి, ఏపీడీ మైక్రో ఇరిగేషన్ ఫిరోజ్, మండల వ్యవసాయ అధికారులు, మైక్రో ఇరిగేషన్ జిల్లా కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.




