Kurnool: వీబీజీ రామ్ జీ పనులు వేగవంతం చేయాలి కర్నూలు కలెక్టర్ డా. ఏ. సిరి!

Kurnool: కర్నూలు జిల్లాలో వీబీజీ రామ్ జీ పథకం కింద అర్హులైన శ్రామికులకు పని కల్పించాలని కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. ఇళ్ల స్థలాల కోసం ప్రత్యేక డ్రైవ్‌కు పిలుపు.

C. Ganesh, Kodumuru
Published on: 14 Oct 2026 5:47 PM IST
Kurnool
X

Kurnool: వీబీజీ రామ్ జీ పనులు వేగవంతం చేయాలి కర్నూలు కలెక్టర్ డా. ఏ. సిరి!

కర్నూలు: కర్నూలు జిల్లా వీబీజీ రామ్ జీ పథకం కింద చేపట్టిన పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయడంతో పాటు, అర్హులైన శ్రామికులకు విస్తృతంగా ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం గూడూరు మండలం కె. నాగలాపురం గ్రామంలో జలధార–జలహారతి 2.0 కార్యక్రమం కింద చేపడుతున్న నీటి సంరక్షణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి, కూలీల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గత వారం రోజుకు 80 నుంచి 90 మంది వరకు కూలీలు పనులకు హాజరుకాగా, ప్రస్తుతం 110 మంది లక్ష్యానికి గాను 60 మంది మాత్రమే హాజరవుతున్నారని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గ్రామంలోని అర్హులైన శ్రామికులందరికీ ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల ప్రాధాన్యతను కూలీలకు వివరించి, వారు పనులకు హాజరయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రతి గ్రామంలో వీబీజీ రామ్ జీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా శ్రామికులకు పని కల్పించాలని, చేపట్టిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

అనంతరం శ్రామికులతో మాట్లాడిన కలెక్టర్, వారానికి ఎన్ని రోజులు పని లభిస్తోంది, వేతనాలు సక్రమంగా అందుతున్నాయా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయా అనే విషయంపై ఆరా తీశారు.

అలాగే, ఇళ్లు లేని అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి, వారికి గృహ నిర్మాణ పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు దరఖాస్తుల స్వీకరణకు మూడు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ నరసింహారెడ్డి, డ్వామా ఏపీడీ పద్మ, తదితర అధికారులు పాల్గొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru