Kurnool: పరిశ్రమల అనుమతులు గడువులోగా ఇవ్వాలి: కలెక్టర్ డా. ఏ. సిరి
Kurnool: కర్నూలు కలెక్టరేట్‌లో నిర్వహించిన DIEPC సమావేశంలో పరిశ్రమల అనుమతులు, MSME పార్కులు, క్లస్టర్ల అభివృద్ధిపై కలెక్టర్ డా. ఏ. సిరి సమీక్షించారు.
Kurnool: పరిశ్రమల అనుమతులు గడువులోగా ఇవ్వాలి: కలెక్టర్ డా. ఏ. సిరి
కర్నూలు: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు MSMEలకు అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ (DIEPC) సమావేశంలో జిల్లాలో పరిశ్రమల పురోగతి, పరిశ్రమల అనుమతులు, MSME పార్కులు, పారిశ్రామిక క్లస్టర్లు, RAMP కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సింగల్ డిస్క్ పోర్టల్ ద్వారా 42 దరఖాస్తులు వచ్చాయని 24 అప్లికేషన్స్ అనుమతి పొందగా 18 అప్లికేషన్స్ వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న పరిశ్రమల అనుమతులను శాఖల వారీగా గుర్తించి, ప్రతి దరఖాస్తుకు నిర్దిష్ట గడువు నిర్ణయించి సత్వరంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏ స్థాయిలో దరఖాస్తు పెండింగ్‌లో ఉందో స్పష్టంగా గుర్తించి, జాప్యానికి కారణాలను పరిష్కరించాలని సూచించారు.
ఎమ్మిగనూరు, ఆలూరు, కోడుమూరు తదితర ప్రాంతాల్లోని MSME పార్కుల్లో రోడ్లు, విద్యుత్, నీరు వంటి మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించి, జరుగుతున్న పనులకు నిర్దిష్ట పూర్తి గడువు నిర్ణయించాలని సూచించారు. మూడు నెలల గడువు ఉన్న పనులపై వారానికోసారి సమీక్ష నిర్వహించాలని తెలిపారు.
స్థానిక వనరుల ఆధారంగా పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి
జిల్లాలో స్థానిక వనరులు, సంప్రదాయ వృత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇప్పటికే ఉన్న MSME యూనిట్ల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (APCDP) కింద కొత్త పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించి అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
హ్యాండ్‌లూమ్, పవర్‌లూమ్, కాటన్, ఫుడ్ ప్రాసెసింగ్, మిరప, టమాటా తదితర రంగాల్లో క్లస్టర్ల ఏర్పాటుకు అవకాశాలను గుర్తించి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. క్లస్టర్ల ఏర్పాటులో ఆసక్తి ఉన్న పారిశ్రామిక యూనిట్లు, వృత్తిదారులను గుర్తించి SPV ఏర్పాటు, రిజిస్ట్రేషన్, DPRల తయారీ, ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తదితర ప్రక్రియలను నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
RAMP కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలి
RAMP (Raising and Accelerating MSME Performance) కార్యక్రమం కింద MSMEలకు అందుబాటులో ఉన్న ప్రోత్సాహకాలు, సాంకేతిక, సంస్థాగత సహకారంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. యువత, స్టార్టప్‌లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. డిగ్రీ కళాశాలల చివరి సంవత్సరం విద్యార్థులకు కూడా పారిశ్రామిక అవకాశాలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
పరిశ్రమల అనుమతులు, MSME పార్కులు, క్లస్టర్ అభివృద్ధి, RAMP కార్యక్రమాల అమలుపై టైమ్‌లైన్ ఆధారిత మానిటరింగ్ చేపట్టి, వారానికోసారి పురోగతిని సమీక్షించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జవహార్ బాబు, ఏ.పి.ఐ.ఐ.సి జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి దీప్తి, ఎల్.డి.ఏం మోహన్, మార్కెటింగ్ ఏ.డి నారాయణ మూర్తి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిషోర్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ అధికారి రాధిక, జిల్లా రవాణా శాఖ అధికారి శాంతి, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రతినిధి విజయ లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.




