Kurnool: జీజీహెచ్‌లో నిలిచిన నిర్మాణ పనులు పూర్తి చేయాలి

Kurnool: కర్నూలు జీజీహెచ్‌ను సందర్శించిన మాజీ ఎంపీ బుట్టా రేణుక. ఆసుపత్రిలో నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్.

V RAMAMOHAN, KURNOOL
Published on: 17 Sept 2026 1:54 PM IST
Kurnool
X

Kurnool: జీజీహెచ్‌లో నిలిచిన నిర్మాణ పనులు పూర్తి చేయాలి

కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. గురువారం జీజీహెచ్‌ను సందర్శించిన ఆమె వివిధ వార్డులు, నిర్మాణ పనులను పరిశీలించారు.

నాడు–నేడు కింద చేపట్టిన పనుల్లో దాదాపు 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 25 శాతం పనులను అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా నిలిపివేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనివిమర్శించారు.

పలు వార్డుల్లో ఒకే బెడ్‌పై ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితి దారుణమన్నారు. నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఆపరేషన్‌ థియేటర్ల కొరత ఏర్పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కర్నూలుతో పాటు రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు సేవలందించే కీలక ఆసుపత్రి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు.

పెండింగ్‌ పనులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బుట్టా రేణుక డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL