Markapuram: ఆర్థిక అక్షరాస్యత కేంద్రం చొరవతో అందిన రూ.2 లక్షల బీమా పరిహారం!
Markapuram: మార్కాపురం జిల్లాలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు ద్వారా మరణించిన మహిళ కుటుంబానికి రూ.2 లక్షల పీఎంజేజేబీవై బీమా పరిహారం అందజేత.
Markapuram: ఆర్థిక అక్షరాస్యత కేంద్రం చొరవతో అందిన రూ.2 లక్షల బీమా పరిహారం!
Markapuram: కంభం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం అవగాహన కార్యక్రమం ఓ కుటుంబానికి అండగా నిలిచింది. బ్యాంకు ఖాతాలో ఉన్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) బీమా వివరాలను గుర్తించి, మరణించిన మహిళ కుటుంబానికి రూ.2 లక్షల బీమా పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం చిన్నకందుకూరు గ్రామానికి చెందిన ఆరేపల్లి ఇందిరమ్మ (53) గుండెపోటుతో మరణించారు. ఆమె సోదరుడు ఆరేపల్లి వెంకట శివరామరాజు ఇటీవల గ్రామంలో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌టీ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కంభం కౌన్సిలర్లు పందీటి అశోక్ కుమార్, డోలు ఉదయ్ బ్యాంకింగ్, సామాజిక భద్రతా పథకాలు, డిజిటల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ మోసాలు, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంభం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ మేనేజర్ హజీజ్ పీరా, అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట శివరామరాజు తన సోదరి మరణించిన విషయాన్ని తెలియజేశారు. ఆమె బ్యాంకు పాస్‌బుక్‌ను పరిశీలించిన అధికారులు ఖాతా వివరాలను తనిఖీ చేయగా, పీఎంజేజేబీవై బీమా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం బీమా పరిహారం కోసం దరఖాస్తు ప్రక్రియను చేపట్టారు.
దీంతో ఇందిరమ్మ నామినీ అయిన ఆమె సోదరుడు వెంకట శివరామరాజు బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షల బీమా పరిహారం జమ అయింది. ఈ మొత్తాన్ని తన సోదరి పిల్లల చదువులకు, వారి కుటుంబ అభివృద్ధికి వినియోగిస్తానని వెంకట శివరామరాజు తెలిపారు. బీమా పథకం గురించి అవగాహన కల్పించి, పరిహారం అందేలా సహకరించిన బ్యాంకు అధికారులకు, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌టీ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ బి. శ్రీను, ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ వి. అశోక్ కుమార్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాల ద్వారా బ్యాంకింగ్, బీమా పథకాలపై అవగాహన పెంచుకోవడం వల్ల అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు అందే అవకాశం ఉందని ఈ ఘటన తెలియజేస్తోంది.




