Veldurthi: రైతుల భూ హక్కులకు భరోసా: ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్
Veldurthi: వెల్దుర్తి మండలం సూదేపల్లిలో రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లను అందజేసిన పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్.. స్వల్పకాలిక పంటలు వేయాలని సూచన.
Veldurthi: రైతుల భూ హక్కులకు భరోసా: ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్
Veldurthi: భూ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ గారు అన్నారు. వెల్దుర్తి మండలంలోని సూదేపల్లి గ్రామంలో పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని రైతులకు పాస్‌బుక్‌లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతుల భూమి హక్కు పత్రాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తన ముద్ర వేసుకున్నారని విమర్శించారు. రైతుల భూమి పత్రాలపై ప్రభుత్వ అధినేతల ఫొటోలు, ప్రచార ముద్రలు ఉండటం సరైన విధానం కాదని, రైతు భూమిపై హక్కు రైతుదేనని, ఆ హక్కుకు ప్రభుత్వాలు కేవలం రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాత్రమే ఉందని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల హక్కులకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతు సంక్షేమం – భూ హక్కుల పరిరక్షణ – అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఎమ్మెల్యే సూచన
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో వంటి ప్రభావాల కారణంగా వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.దీర్ఘకాలిక పంటలపై ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోయే పరిస్థితి రాకుండా, తక్కువ కాలంలో చేతికి వచ్చే స్వల్పకాలిక పంటలు, తక్కువ పెట్టుబడితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలని రైతులను మరీ మరీ కోరారు.
అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూసారం, వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.రైతులు ఆర్థికంగా నష్టపోకుండా తక్కువ పెట్టుబడి – తక్కువ కాలం – త్వరిత ఆదాయం వచ్చే పంటల వైపు దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




