Nandyal: మహానంది ఆలయ ధ్వజస్తంభంపై నెలవంక, పరవశించిన భక్తులు!
Nandyal: నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం వేళ ధ్వజస్తంభం శిఖరంపై నెలవంక, కింద కార్తీక దీపాల వెలుగుల అద్భుత దృశ్యం భక్తులను ఆకట్టుకుంది.
Nandyal: మహానంది ఆలయ ధ్వజస్తంభంపై నెలవంక, పరవశించిన భక్తులు!
Nandyal: నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా ఆకాశంలో ఆవిష్కృతమైన ఓ అద్భుత దృశ్యం భక్తులను పరవశింపజేసింది. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వెనుక ఆకాశంలో నెలవంక దర్శనమివ్వగా.. ధ్వజస్తంభం కింద వెలిగించిన కార్తీక దీపాల వెలుగులు ఆ దృశ్యానికి మరింత ఆధ్యాత్మిక శోభను అద్దాయి.
ధ్వజస్తంభం శిఖరంపై నెలవంక కొలువుదీరినట్లుగా కనిపించడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. పరమేశ్వరుడి జటాజూటంపై అలంకారంగా ఉండే చంద్రవంక.. సాక్షాత్తూ ధ్వజస్తంభంపైనే వెలసినట్లుగా కనిపిస్తోందంటూ భక్తులు మురిసిపోయారు. ఒకవైపు ఆకాశంలో వెన్నెల వెలుగులు.. మరోవైపు ఆలయంలో కార్తీక దీపాల కాంతులు.. మధ్యలో ఠీవిగా నిలిచిన ధ్వజస్తంభం.. ఈ మూడు కలిసిన దృశ్యం మహానంది క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కార్తీక మాసంలో పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఈ అరుదైన దృశ్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. తమ సెల్ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రకృతి అందాలకు ఆధ్యాత్మికత తోడైతే ఎలా ఉంటుందో అన్నట్లుగా కనిపించిన ఈ దృశ్యం భక్తుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.
మహానంది క్షేత్రంలో కార్తీక మాస వేడుకలకు ఈ ఆకాశ అద్భుతం మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. భక్తి, ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఈ అపురూప దృశ్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.




