Markapur: మార్కాపురం జిల్లా అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలి!
Markapur: మార్కాపురం జిల్లా సమగ్ర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని సీపీఎం డిమాండ్. ఈ నెల 7న ఆర్టీసీ బస్టాండ్ నుంచి భారీ ర్యాలీ, బహిరంగ సభ.
Markapur: మార్కాపురం జిల్లా అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలి!
Markapur: మార్కాపురం జిల్లా సమగ్ర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని సీపీఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పి.సి. కేశవరావు డిమాండ్ చేశారు. ఆదివారం కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో మార్కాపురం జిల్లా అభివృద్ధి డిమాండ్లపై రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
మార్కాపురం జిల్లా ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరగడం లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో దశను పూర్తి చేసి సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని, జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంపొందించాలని కోరారు. వలసల నివారణకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, రైతుల పంటలకు విలువ పెంచే చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ శాఖలకు పూర్తిస్థాయి అధికారులు, సిబ్బందిని నియమించాలని, పెండింగ్లో ఉన్న మెడికల్ కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధరలు, సాగునీటి సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు.
ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటలకు మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీ, అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కేశవరావు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపిఎం నాయకులు ఏడుకొండలు, నరేంద్ర, ప్రసంగి, మాల్యాద్రి, దయమ్మ తదితరులు పాల్గొన్నారు.




