Kodumuru: బస్సు సర్వీసులు పెంచాలని కోడుమూరులో సీపీఎం ధర్నా!

Kodumuru: కోడుమూరులో ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్త్రీ శక్తి పథకానికి తగినంత రద్దీకి బస్సులు లేవని నిరసన.

C. Ganesh, Kodumuru
Published on: 12 Oct 2026 1:44 PM IST
Kodumuru
X

Kodumuru: బస్సు సర్వీసులు పెంచాలని కోడుమూరులో సీపీఎం ధర్నా!

Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరులో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీఐటీయూ మండల అధ్యక్షుడు వీరన్న ఆధ్వర్యంలో కోడుమూరు కొత్త బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఎం మండల కమిటీ సభ్యుడు గఫూర్ మియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం బాగున్నప్పటికీ, ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రోజువారీ ప్రయాణాల కోసం రెండు నుంచి మూడు గంటల పాటు బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోందని, గంటల తరబడి నిరీక్షించినా బస్సులు కిక్కిరిసి వస్తుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

పండుగలు, సెలవులు, పెళ్లిళ్ల సీజన్లలో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలన్నా ముందురోజే ప్రయాణం ప్రారంభించాల్సిన దుస్థితి ఉందన్నారు, దీంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని అన్నారు. పిల్లలు, వృద్ధులతో ప్రయాణించేవారు కూడా బస్సుల రద్దీ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లోని పలు బస్టాపుల్లో బస్సులు ఆపడం లేదని, కొన్ని చోట్ల నిర్ణీత స్టేజీకి దూరంగా బస్సులను నిలుపుతున్నారని విమర్శించారు. కోడుమూరు పాత బస్టాండ్ వద్ద రెండు, మూడు స్టాప్‌లలో బస్సులు ఆపడం లేదని, ఆపినా సుమారు అర కిలోమీటరు దూరంలో నిలుపుతున్నారని తెలిపారు. ఈ సమస్యను పలుమార్లు స్థానిక కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే నిర్వహించాలని గఫూర్ మియా కోరారు. ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం దసరా పండుగ సెలవులను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు, ఏడాది పొడవునా రోజువారీ ప్రయాణికుల అవసరాలను పరిగణనలోకి తీసుకొని అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కోడుమూరు ఆర్టీసీ కంట్రోలర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నక్క గిడ్డయ్య, కొత్తూరు మల్లికార్జున, కర్రె శంకర్, వెంకటస్వామి, పులకుర్తి రంగస్వామి తదితరులతో పాటు బస్టాండ్‌లోని ప్రయాణికులు పాల్గొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru