Kurnool: జనగణన ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి..కమిషనర్ ఓబులేసు!

Kurnool: కర్నూలులో జనగణన-2027 ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని, జనవరి 10 నుంచి స్వీయ గణన ప్రారంభమవుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 12 Nov 2026 5:06 PM IST
Kurnool
X

Kurnool: జనగణన ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి..కమిషనర్ ఓబులేసు!

Kurnool: జనగణన-2027లో భాగంగా రెండో దశలో నిర్వహించనున్న జనాభా గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియను కర్నూలు నగరంలో పకడ్బందీగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. గురువారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించే శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జనవరి 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ప్రక్రియకు అవకాశం ఉంటుందని, జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఇంటింటి జనాభా గణన నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనంతరం మార్చి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పునఃపరిశీలన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న 22 మంది మాస్టర్ ట్రైనర్లు, తదుపరి సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు డిసెంబర్ రెండో వారంలో శిక్షణ అందించనున్నట్లు వివరించారు.

జనగణన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి అంశంపై పూర్తి అవగాహనతో శిక్షణ పొందాలని సూచించారు. జనగణన దేశ అభివృద్ధికి అవసరమైన కీలకమైన సమాచార సేకరణ ప్రక్రియ కావడంతో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, సెన్సస్ ఇంచార్జి ఇశ్రాయేలు, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL