Nandyal: సేవా కార్యక్రమాలతో ప్రజల మనసు గెలిచి సర్పంచ్‌గా ఇందిరారెడ్డి!
Nandyal: బనగానపల్లెలో అనేక సేవా, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనసు గెలిచిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బి.సి. ఇందిరారెడ్డి తాజాగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
Nandyal: సేవా కార్యక్రమాలతో ప్రజల మనసు గెలిచి సర్పంచ్‌గా ఇందిరారెడ్డి!
Nandyal: ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, సామాజిక సేవనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగిన మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి సతీమణి బి.సి. ఇందిరారెడ్డి తాజాగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికై ప్రత్యక్ష ప్రజాసేవలోకి అడుగుపెట్టారు. నాడు వివిధ సంక్షేమ, సామాజిక కార్యక్రమాలతో ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకున్న ఆమె.. నేడు ప్రజాప్రతినిధిగా గ్రామాభివృద్ధికి మరింత బాధ్యతతో పనిచేసే అవకాశం పొందారు.
బనగానపల్లె నియోజకవర్గంలో పర్యావరణ పరిరక్షణ, మహిళా సంక్షేమం, విద్య, వైద్యం, నిరుద్యోగ యువతకు ఉపాధి, నిరుపేదలకు ఆర్థిక భరోసా వంటి అనేక కార్యక్రమాలను ఆమె వ్యక్తిగత చొరవతో చేపట్టారు. 'నా బనగానపల్లె - నా ఆరోగ్యం' కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అవగాహన కల్పించి, పట్టణంలో దాదాపు 80 శాతం మేర ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని తీసుకురావడంలో కృషి చేశారు.
'హరితపల్లె మా బనగానపల్లె' కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి సుమారు రూ.30 లక్షల విలువైన మొక్కలను ప్రత్యేకంగా ఎంపిక చేసి తీసుకొచ్చి పట్టణంలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మహిళలు, గర్భిణుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి నెలా 9వ తేదీన బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 100 మంది గర్భిణులకు తన సొంత నిధులతో ఉచిత పౌష్టికాహారం అందిస్తున్నారు. కైపా, సంకలాపురం, చెరువుపల్లి తదితర గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు నెలకు రూ.3,000 చొప్పున వ్యక్తిగత నిధులతో పెన్షన్ అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.
విద్యార్థినుల సౌకర్యార్థం ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్‌లో రూ.2 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు, బనగానపల్లె జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు సొంత ఖర్చులతో 35 బెంచీలు అందజేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పట్టణంలోని ప్రభుత్వ మైదానంలో సొంత నిధులతో వాకింగ్ ట్రాక్ నిర్మించారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి ఏటా ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు.
పర్యావరణహిత వినాయక చవితి వేడుకలను ప్రోత్సహిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ ప్రతి ఏటా నూతన వస్త్రాలు పంపిణీ చేసి వారిని గౌరవిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా మహిళలు, బాలికల కోసం ముగ్గులు, మెహందీ పోటీలు నిర్వహించి విజేతలకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు వంటి బహుమతులు అందిస్తూ మహిళా సాధికారతకు ప్రోత్సాహం అందిస్తున్నారు.
అలాగే BCJR వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరవుతూ, విషాద సమయాల్లో బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించి నైతికంగా, ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.
సామాజిక సేవకు ప్రజల మద్దతు తోడై
ఇప్పటివరకు వ్యక్తిగత చొరవతో, సామాజిక బాధ్యతగా చేపట్టిన సేవా కార్యక్రమాలకు ప్రజల ఆదరణ లభించగా, తాజా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నిక కావడం ఆమె సేవా ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఇకపై గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగనున్నారు.




