Banaganapalle: బనగానపల్లెకు ₹510 కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టు
Banaganapalle: బనగానపల్లె నియోజకవర్గంలో ₹510 కోట్లతో మల్టీ విలేజ్ తాగునీటి పథకం మంజూరైంది; 157 ఆవాసాల్లోని 3.85 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
Banaganapalle: బనగానపల్లెకు ₹510 కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టు
బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక అడుగు పడింది. జల్ జీవన్ మిషన్ – *‘అమరజీవి జలధార’*లో భాగంగా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించిన రూ.30 వేల కోట్ల పనుల్లో భాగంగా బనగానపల్లె నియోజకవర్గానికి రూ.510 కోట్ల మల్టీ విలేజ్ స్కీమ్ (MVS) మంజూరైంది.
ఓవీకే రిజర్వాయర్‌ను నీటి వనరుగా వినియోగించుకుని చేపట్టనున్న ఈ పథకానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది. నిర్మాణ పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 157 ఆవాసాలకు ఈ పథకం ద్వారా తాగునీటి సరఫరా కల్పించనున్నారు.
3.85 లక్షల మందికి ప్రయోజనం.
30 ఏళ్ల డిజైన్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ ప్రాజెక్టు ద్వారా 2058 నాటికి 3.85 లక్షల జనాభాకు తాగునీటి సరఫరా అందించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం 9,070 కుటుంబాలకు ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు కల్పించనున్నారు.
ప్రాజెక్టులో 25 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఇంటేక్ వెల్, సంపులు, ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు తదితర మౌలిక వసతులు నిర్మించనున్నారు. మొత్తం 184 ప్రధాన నిర్మాణాలు ప్రతిపాదించారు.
4,023 కి.మీ పైపులైన్ నెట్‌వర్క్
రిజర్వాయర్ నుంచి నీటిని సేకరించి శుద్ధి చేసి గ్రామాలకు సరఫరా చేసేందుకు మొత్తం 4,023.35 కి.మీ పొడవైన పైపులైన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ముడి నీటి పంపింగ్ మెయిన్, క్లియర్ వాటర్ పంపింగ్ మెయిన్, గ్రావిటీ మెయిన్, డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఉన్నాయి.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చొరవతో వేగం
బనగానపల్లె నియోజకవర్గానికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలన్న లక్ష్యంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. అధికారులతో సమన్వయం చేస్తూ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లడంతో టెండర్ ప్రక్రియ పూర్తై నిర్మాణ పనులు కాంట్రాక్టర్‌కు అప్పగించే దశకు చేరాయి.
పనులు పూర్తయితే ఐదు మండలాల పరిధిలోని 157 ఆవాసాలకు తాగునీటి సరఫరా మెరుగుపడటంతో పాటు వేలాది కుటుంబాలకు ఇంటివద్దే కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందుబాటులోకి రానుంది. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న ఈ పథకం బనగానపల్లె నియోజకవర్గ గ్రామీణ తాగునీటి మౌలిక వసతుల్లో కీలక మార్పుకు దోహదపడనుంది.




