Alur: ఆలూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్.. వైఎస్ఆర్సీపీలోకి 50 కుటుంబాలు!
Alur: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మొలగవల్లి గ్రామానికి చెందిన 50 టీడీపీ కుటుంబాలు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిక.
Alur: ఆలూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్.. వైఎస్ఆర్సీపీలోకి 50 కుటుంబాలు!
Alur: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..? మొలగవల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి నాయకత్వంపై నమ్మకంతో టీడీపీని వీడి 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. ఎమ్మెల్యే నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆలూరు నియోజకవర్గంలో పార్టీల మధ్య రాజకీయ పోరు ఆసక్తికరంగా మారుతోంది. మొలగవల్లి గ్రామానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆప్యాయంగా పలకరించారు.
అనంతరం నిర్వహించిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ.. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ రోజురోజుకూ బలహీనపడుతోందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, స్థానిక టీడీపీ ఇన్చార్జి వైఖరితో విసిగిపోయి పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని అన్నారు.
గత రెండున్నరేళ్లలో అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువగా ఉందని, ప్రజా సమస్యలను పక్కనపెట్టి కూటమి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ తన ఉనికిని, విశ్వసనీయతను కోల్పోతోందని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే దిశగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీలో కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలకు సముచిత గౌరవం, తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయంపెంచుకుంటూ ఐక్యంగా ముందుకు సాగుతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు, మొలగవల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు.
మొలగవల్లిలో 50 కుటుంబాల చేరికతో ఆలూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా, ఈ పరిణామం స్థానిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.




