Devanakonda: డెంగ్యూతో 19 నెలల చిన్నారి మృతి - ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా!

Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండలో పారిశుధ్య లోపంతో డెంగ్యూ బారినపడి చిన్నారి మృతి. మృతదేహంతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట తల్లిదండ్రుల ఆందోళన.

G Jagadeesh, Pathikonda
Published on: 30 Sept 2026 1:37 PM IST
Devanakonda
X

Devanakonda: డెంగ్యూతో 19 నెలల చిన్నారి మృతి - ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా!

Devanakonda: దేవనకొండ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. డెంగ్యూ జ్వరంతో 19 నెలల చిన్నారి మృతి చెందాడు. తమ కుమారుడి మృతికి గ్రామంలోని పారిశుధ్య లోపాలే కారణమని తండ్రి నరస నాయుడు ఆరోపిస్తూ మృతదేహంతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.నరస నాయుడు, కవిత దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు 19 నెలల రేవంత్‌ కు వారం రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ జ్వరంగా నిర్ధారణ అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రేవంత్ మృతి చెందాడు.తమ పరిసరాల్లో పారిశుధ్య సమస్యలపై గత నెల రోజులుగా గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బందికి పలుమార్లు సమాచారం ఇచ్చినా సమస్యను పరిష్కరించలేదని తండ్రి ఆరోపించారు. పరిసరాల్లో దుర్వాసన, అపరిశుభ్రత ఉన్నప్పటికీ పారిశుధ్య చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కుమారుడికి డెంగ్యూ సోకడానికి పారిశుధ్య లోపాలే కారణమని తండ్రి ఆరోపించినప్పటికీ, ఈ కారణం అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. ఇదే సమయంలో గ్రామంలో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు.

మృతదేహంతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన నరస నాయుడు.. మరో కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకుండా తక్షణమే పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ధర్నా నేపథ్యంలో అధికారులు స్పందించారు.

గ్రామంలో పారిశుధ్య సమస్యలు, పందుల బెడద, కోతుల సమస్యతో పాటు ట్యాంకుల పరిసరాల్లోని అపరిశుభ్రతను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 15 రోజుల్లో గ్రామ పరిసరాలను శుభ్రపరిచి, సానిటేషన్ చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. పందులు, కోతుల సమస్యపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.చిన్నారి మృతి తమకు కూడా బాధాకరమని అధికారులు తెలిపారు.

గ్రామంలో పారిశుధ్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీడీవో జ్యోతి , గోపాల్, సీఐ వేణుగోపాల్ EORD గోపాల్ తదితర అధికారులు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చినట్లు సమాచారం.మరోవైపు, అధికారులు ఇచ్చిన హామీ మేరకు 15 రోజుల్లో దేవనకొండలో పారిశుధ్య సమస్యలు, పందులు–కోతుల బెడద, ట్యాంకుల పరిసరాల పరిశుభ్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది.

నా కుమారుడికి జరిగిన విషాదం మరొక తల్లిదండ్రులకు, మరొక చిన్నారికి జరగకూడదు. అధికారులు వెంటనే గ్రామంలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించి, పరిశుభ్రత చర్యలు చేపట్టాలి” అని తండ్రి నరస నాయుడు కన్నీటి పర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda