Tiruvuru: మియాపూర్ ప్రయాణం.. మరమ్మతులతోనే సరి! తిరువూరు హైటెక్ బస్సుపై అసహనం

Tiruvuru: తిరువూరు నుంచి మియాపూర్ వెళ్లే ఆర్టీసీ హైటెక్ బస్సుకు వరుస మరమ్మతులు ఎదురయ్యాయి. రేడియేటర్‌లో నీళ్లు లేక అర్ధరాత్రి పొగలు రావడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు.

Venkateswara Rao, Tiruvuru
Published on: 12 Nov 2026 2:25 PM IST
Tiruvuru
X

Tiruvuru: మియాపూర్ ప్రయాణం.. మరమ్మతులతోనే సరి! తిరువూరు హైటెక్ బస్సుపై అసహనం

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నుంచి హైదరాబాద్‌లోని మియాపూర్‌కు వెళ్లే ఆర్టీసీ హైటెక్ బస్సు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది.సురక్షితమైన ప్రయాణం ఉంటుందని ఆశించి బస్సు ఎక్కిన ప్రయాణికులకు మార్గమధ్యంలో వరుస మరమ్మతులతో చుక్కలు కనిపించాయి. గత రాత్రి 10.30 గంటలకు తిరువూరు డిపో నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన బస్సు పట్టణ శివారులోనే హెడ్లైట్ల సమస్యతో నిలిచిపోయింది.

కొద్దిసేపు మరమ్మతులు చేసిన అనంతరం తిరిగి ప్రయాణం ప్రారంభించింది. అయితే చౌటుప్పల్ సమీపానికి చేరుకోగానే మరో సమస్య ఎదురైంది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా ఇంజన్ నుంచి పొగలు రావడంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఏం జరుగుతుందో అర్థంకాక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిశీలించగా రేడియేటర్‌లో నీళ్లు లేకపోవడంతో పొగలు వచ్చినట్లు గుర్తించారు. రేడియేటర్‌లో నీళ్లు పోసేందుకు అర్ధరాత్రి వేళ నీరు కూడా అందుబాటులో లేకపోవడంతో డ్రైవర్ నానా అవస్థలు పడ్డారు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి సమస్యలు ఎదురవడంతో ప్రయాణికులకు ప్రయాణం కాస్తా పరీక్షగా మారింది.

చివరకు ఎలాగోలా బస్సు హైదరాబాద్‌కు చేరుకుంది. అయితే డిపో నుంచి బస్సు బయలుదేరే ముందే కనీస తనిఖీలు నిర్వహించారా? బస్సు కండిషన్‌ను పరిశీలించారా? అన్న ప్రశ్నలు ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. హైటెక్ బస్సు పేరుతో చార్జీలు వసూలు చేస్తూ కనీస నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రయాణికుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు.

ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు కళ్లు తెరిచి బస్సుల నిర్వహణపై దృష్టి సారించాలని, ప్రతి ట్రిప్పుకు ముందు ఇంజన్, రేడియేటర్, లైట్లు తదితర కీలక భాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru