Tiruvuru: తిరువూరు డివిజన్‌లో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ రెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో ఏ. కుమార్ హెచ్చరించారు.
Tiruvuru: తిరువూరు డివిజన్‌లో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Tiruvuru: తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట–రంగాపురం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ హెచ్చరించారు.
ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సమీప గ్రామాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పులిని సురక్షితంగా బంధించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని తెలిపారు.
డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పులి కదలికలను పరిశీలించడంతో పాటు, ట్రాకర్ల సాయంతో దాని సంచారాన్ని గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.
మహారాష్ట్ర (పూణే), నాగార్జునసాగర్ రిజర్వు ఫారెస్ట్ నుంచి ప్రత్యేక నిపుణులను రప్పించి పులిని బంధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు ఒంటరిగా వెళ్లకూడదని, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో సూచించారు.
పెద్దపులి కనిపించినా, దాని అడుగుజాడలు లేదా ఇతర ఆనవాళ్లు గుర్తించినా దాని సమీపానికి వెళ్లకుండా వెంటనే అటవీశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని ఆర్డీవో ఏ. కుమార్ విజ్ఞప్తి చేశారు.




