Tadigadapa: తాడిగడపలో రూ.11.8 కోట్ల అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్
Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీలో రూ.11.8 కోట్లతో 30 సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు; రూ.150 కోట్లతో శాశ్వత తాగునీటి ప్రాజెక్ట్ చేపట్టనున్నారు.
Tadigadapa: తాడిగడపలో రూ.11.8 కోట్ల అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్
తాడిగడప: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని యనమలకుదురు,తాడిగడప గ్రామాల్లో HAM పథకం కింద రూ.11.8 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పెనమలూరు శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ...
యనమలకుదురు గ్రామంలో సుమారు రూ.7.50 కోట్లతో 23 సిమెంట్ రోడ్లు తాడిగడప గ్రామంలో సుమారు రూ.3.80 కోట్లతో 7 సిమెంట్ రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు,మున్సిపాలిటీ పరిధిలో మిగిలి ఉన్న మట్టి రోడ్లను దశలవారీగా సిమెంట్ రోడ్లుగా మార్చే లక్ష్యంతో పనులు చేపడుతున్నామని చెప్పారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండున్నరేళ్లలో తాడిగడప మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని,రోడ్లు,డ్రైనేజీ, మంచినీరు వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు తెలిపారు.
యనమలకుదురు మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
అధిక జనసాంద్రత కలిగిన యనమలకుదురులో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నట్లు
ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు తెలిపారు,సుమారు 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైప్‌లైన్లు పాతబడిపోవడంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా సుమారు రూ.150 కోట్లతో కొత్త పైప్‌లైన్లు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి కృష్ణా నది జలాలను ప్రజలకు అందించే భారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించారు,దీనికి సంబంధించిన DPR ఇప్పటికే ప్రభుత్వానికి చేరిందని,త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు,రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేసి యనమలకుదురు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.
శాశ్వత మంచినీటి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.కృష్ణా నది నుంచి మూడు బోర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి యనమలకుదురు కొండపై ఉన్న ప్రధాన వాటర్ ట్యాంకుకు అనుసంధానం చేసేందుకు సుమారు రూ.1.25 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అవసరమైతే ఈ పైప్‌లైన్‌ను ఇతర ట్యాంకులకు కూడా విస్తరించి నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
డ్రైనేజీ వ్యవస్థకు అదనంగా రూ.50 కోట్లు
తాడిగడప మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అదనంగా రూ.50 కోట్ల నిధులను తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు తెలిపారు,అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన చోట్ల డ్రైనేజీ పనులు చేపడతామని,వీటిలో ఎక్కువ భాగం రాబోయే ఏడాది నుంచి ఏడాదిన్నరలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గతంలోనూ యనమలకుదురు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ యనమలకుదురు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు బోడే ప్రసాద్ గారు తెలిపారు,ప్రభుత్వ నిధుల కోసం మాత్రమే ఎదురుచూడకుండా స్థానికుల సహకారంతో సుమారు 75–80 రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
డొంక రోడ్లు,శివపార్వతినగర్ వంటి ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కూడా లేని పరిస్థితుల నుంచి రోడ్లు,డ్రైనేజీ వంటి సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
యనమలకుదురు వంతెన పూర్తి
యనమలకుదురు వంతెన పనులు గతంలో 80–90 శాతం పూర్తయినప్పటికీ మిగిలిన పనులు పూర్తి కాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే గారు తెలిపారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మిగిలిన పనులను పూర్తి చేసి వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు,వంతెన అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు గణనీయమైన ఉపశమనం లభించిందన్నారు.
యనమలకుదురు–తాడిగడప ప్రధాన రహదారికి కొత్త రూపు
యనమలకుదురు నుంచి తాడిగడప వరకు ఉన్న ప్రధాన రహదారిని 7 మీటర్ల వెడల్పుతో బీటీ రోడ్డుగా అభివృద్ధి చేసే పనులకు కూడా శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు తెలిపారు,రాబోయే రోజుల్లో ప్రాంతంలోని ప్రధాన రహదారులన్నింటినీ మరింత వెడల్పుగా, నాణ్యమైన రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రోడ్లు,డ్రైనేజీ,మంచినీరు వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు,సేవా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని
ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు పేర్కొన్నారు.
ప్రజల సహకారం ఉంటే రాబోయే పది నుంచి పన్నెండు సంవత్సరాల్లో తాడిగడప మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కృష్ణా నది పక్కనే ఉన్నప్పటికీ అధిక TDS ఉన్న నీటిని ప్రజలు తాగాల్సిన పరిస్థితి ఉండకూడదని,స్వచ్ఛమైన,నాణ్యమైన తాగునీటిని అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని బోడే ప్రసాద్ గారు స్పష్టం చేశారు రూ.150 కోట్ల శాశ్వత మంచినీటి ప్రాజెక్టు ప్రారంభమయ్యే వరకు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాత్కాలిక నీటి సరఫరా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.




