Tiruvuru: 22, 23వ వార్డుల్లో జోరుగా పసుపులేటి మాధవి ఇంటింటి ప్రచారం!
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చైర్మన్ అభ్యర్థి పసుపులేటి మాధవి ప్రచారం వేగవంతం చేశారు. 22, 23వ వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల మద్దతు కోరారు.
Tiruvuru: 22, 23వ వార్డుల్లో జోరుగా పసుపులేటి మాధవి ఇంటింటి ప్రచారం!
Tiruvuru: తిరువూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూటమి చైర్మన్ అభ్యర్థి పసుపులేటి మాధవి ప్రత్యేకంగా దృష్టి సారించారు. మున్సిపల్ చైర్మన్ పీఠమే లక్ష్యంగా వార్డులవారీగా ప్రజలను నేరుగా కలుసుకుంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా తిరువూరు పట్టణంలోని కుమ్మరి బజార్, జగన్నాధపురం కాలనీలోని 22, 23వ వార్డుల్లో కూటమి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్ల మద్దతు కోరారు.
చైర్మన్ అభ్యర్థిగా తనను పరిచయం చేసుకుంటూ ప్రతి ఇంటికీ వెళ్లిన మాధవి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలు, వార్డుల్లో నెలకొన్న ఇబ్బందులపై ఆరా తీశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ తిరువూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ ప్రచారంలో టీడీపీ 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సోమవరపు రాజమ్మ, జనసేన 23వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ముత్యాల శ్రీదేవి పాల్గొన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్,మాధవ్ లు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా!
కూటమి తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు పసుపులేటి మాధవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
తిరువూరు పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని అందిస్తానని తెలిపారు. వార్డుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని వివరించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
చైర్మన్ అభ్యర్థి మాధవికి మద్దతుగా కూటమి నేతల ప్రచారం
22, 23వ వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతు కోరుతూ నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని కొనసాగించారు. 22వ వార్డు టీడీపీ అభ్యర్థి సోమవరపు రాజమ్మకు సైకిల్ గుర్తుపై, 23వ వార్డు జనసేన అభ్యర్థి ముత్యాల శ్రీదేవికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మాధవి విజ్ఞప్తి చేశారు.
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తనకు ప్రజల ఆశీస్సులు అందించాలని కోరుతూ, తిరువూరు అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. కుమ్మరి బజార్, జగన్నాధపురం కాలనీల్లో సాగిన ఇంటింటి ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




