Vuyyuru: ఉయ్యూరు కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ డీకే బాలాజీ
Vuyyuru: ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బంది శిక్షణలో కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు.
Vuyyuru: ఉయ్యూరు కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణా జిల్లా: రెండవ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా ఉయ్యూరు మున్సిపాలిటీకి నిర్వహించనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉయ్యూరులో ఉయ్యూరులోని ఏజీఎస్‌జీ సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ సిబ్బంది మరియు సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలు, ఎదురయ్యే ప్రాక్టికల్ సమస్యలు, వాటిని పరిష్కరించే విధానాలు, కౌంటింగ్ కేంద్రంలో ప్రక్రియను ప్రారంభించే విధానం, ఓట్ల లెక్కింపు చేపట్టే దశలు తదితర అంశాలపై సిబ్బందికి వివరించారు.
కౌంటింగ్ విధులకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ ఆర్ఓ హ్యాండ్‌బుక్‌లోని కౌంటింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా చదివి, అందులో పేర్కొన్న నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ సూచించారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి సందేహాలు, పొరపాట్లు తలెత్తకుండా ముందస్తుగానే ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
శిక్షణలో భాగంగా కౌంటింగ్ విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించాలని, అనంతరం మాక్ కౌంటింగ్ నిర్వహించి సిబ్బందికి క్షేత్రస్థాయి అనుభవం కల్పించాలని శిక్షణ నిర్వాహకులకు సూచించారు. కౌంటింగ్ సమయంలో ఎదురయ్యే సమస్యలను ప్రాక్టికల్‌గా వివరించి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలో తెలియజేయాలన్నారు.
ప్రతి ఓటును కౌంటింగ్ సమయంలో సంబంధిత కౌంటింగ్ ఏజెంట్లు, అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారి పరిశీలించేలా నిబంధనల ప్రకారం చూపించిన అనంతరమే సంబంధిత టేబుల్‌పై కేటాయించిన విధంగా ఉంచాలని సూచించారు. ప్రతి ఓటు లెక్కింపులోనూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పారదర్శకతతో, నిష్పక్షపాతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాట్ల పరిశీలన
అనంతరం అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడ మున్సిపల్ కమిషనర్, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను వేగవంతంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ సిబ్బందికి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి సంబంధించిన సామగ్రిని సక్రమంగా అందజేసి, ఎలాంటి జాప్యం లేకుండా వారిని తమ తమ పోలింగ్ స్టేషన్లకు పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్ల తనిఖీ
అనంతరం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి కౌంటింగ్ హాల్ వరకు ఏర్పాటు చేసిన మార్గాన్ని, మార్గానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన బారికేడ్లు, ఫెన్సింగ్‌ను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. మార్గమంతటా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని, ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్‌ను కూడా కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ టేబుళ్లు, కుర్చీలు, సిబ్బంది కూర్చునే ఏర్పాట్లు, కౌంటింగ్ టేబుళ్ల చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తదితర అంశాలను పరిశీలించి సంబంధిత రిటర్నింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌కు పలు సూచనలు చేశారు.
కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, సజావుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత ఎన్నికల అధికారులు, కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది.




