Kankipadu: కంకిపాడు మండలంలో రూ.2.15 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

Kankipadu: కంకిపాడు మండలంలో రూ.2.15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేసి, గత వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు.

Ramana, Penamaluru
Published on: 5 Oct 2026 7:10 PM IST
Kankipadu
X

Kankipadu: కంకిపాడు మండలంలో రూ.2.15 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

Kankipadu: కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు, గొడవర్రు,చలివేంద్రపాలెం,నెప్పల్లి గ్రామాల్లో రూ.2.15 కోట్లతో ఎన్‌ఆర్‌ఈజీఎస్,పంచాయతీ గ్రాంట్ తదితర నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు.

ఒక్క ఈడుపుగల్లు గ్రామంలోనే ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా రూ.1.15 కోట్లు,మరో రూ.75 లక్షలు,పంచాయతీ గ్రాంట్ ద్వారా రూ.1 కోటి,ఆర్‌అండ్‌బీ రోడ్లకు సుమారు రూ.5.50 కోట్లు,సీఆర్‌డీఏ ద్వారా మరో రూ.8 కోట్లతో పనులు జరుగుతున్నాయని,మొత్తంగా రూ.16 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉండి గ్రామీణ ప్రాంతాలకు ఏం చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని బోడే ప్రసాద్ ప్రశ్నించారు, మేము రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని లెక్కలతో సహా ప్రజల ముందుంచుతున్నాం,వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇంతలో పదో వంతు నిధులైనా ఈడుపుగల్లు,కంకిపాడు మండలానికి ఖర్చు చేసిందా అని నిలదీశారు.

వైసీపీ పాలనలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని,గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తయిన పనులను సైతం పూర్తి చేయకుండా పక్కన పెట్టారని విమర్శించారు,వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను తీర్చుకుంటూనే నిలిచిపోయిన పనులను పునఃప్రారంభిస్తూ,కొత్త అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

ఇప్పటికే ఎమ్మెల్యే నిధుల ద్వారా రూ.11 కోట్ల విలువైన పనులు చేపట్టామని,సీఆర్‌డీఏ ద్వారా రూ.105 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని తెలిపారు,ఇంకా రెండేళ్ల పాలనా సమయం ఉందని,రాబోయే రోజుల్లో అభివృద్ధి మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.

వైసీపీ పాలనలో అభివృద్ధి కనిపించలేదు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కళ్లకు కనిపిస్తోంది,అందుకే వైసీపీ నాయకులకు కడుపుమంట మొదలైంది,ప్రజల మధ్యకు వెళ్లి అభివృద్ధిపై మాట్లాడే ధైర్యం లేక సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు,ఆరోపణలకే పరిమితమవుతున్నారు అని బోడే ప్రసాద్ గారు మండిపడ్డారు.

అభివృద్ధి,సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు, పింఛన్లు,రైతు సంక్షేమం,పేదల సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

రోడ్లు,డ్రైనేజీలు,తాగునీరు,గ్రామీణ మౌలిక వసతులు,సీఆర్‌డీఏ పరిధిలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రచారం అవసరం లేదు...క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులే మాట్లాడుతున్నాయి అన్నారు.

మంత్రి నారా లోకేష్‌పై రాజకీయ కక్షతో డీఎస్సీ అంశాన్ని కూడా వైసీపీ నాయకులు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని బోడే ప్రసాద్ గారు మండిపడ్డారు,వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం,ప్రజలను తప్పుదోవ పట్టించడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు.

ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు,ఎవరు అభివృద్ధి చేశారు? ఎవరు విధ్వంసం చేశారు? ఎవరు సంక్షేమం అందించారు? ఎవరు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు? అన్నీ ప్రజలకు తెలుసు అని స్పష్టం చేశారు.

వైసీపీ నాయకులకు అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు లేదని,ముందుగా తమ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు,చేసిన పనులు,చేసిన అప్పులు,నిలిపివేసిన అభివృద్ధి పనులపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, రోడ్లు, డ్రైనేజీలు,తాగునీరు,గ్రామీణ మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.

వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదు,ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా సంక్షేమం ఆగదు,కూటమి ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది...అభివృద్ధి కొనసాగుతుంది.. ప్రజల సంక్షేమం కొనసాగుతుంది అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు స్పష్టం చేశారు.

తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణంగా అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు,అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru