Wyra: బీసీ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

Wyra: ఖమ్మం జిల్లా వైరాలోని బీసీ వసతి గృహాన్ని కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేసి, నాణ్యమైన పౌష్టికాహారం, మెనూ అమలుపై సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 19 Nov 2026 5:26 PM IST
Wyra
X

Wyra: బీసీ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

వైరా: వసతీగృహాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. గురువారం వైరాలోని తెలంగాణ వెనుకబడిన తరగతుల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న వసతులను, భోజన ఏర్పాట్లను, వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు భోజనం వడ్డించే విధానం, వంటశాలలో పాటిస్తున్న పరిశుభ్రత, వంటకు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు.

అనంతరం స్టోర్ రూమ్‌ను తనిఖీ చేసి నిల్వ ఉంచిన కూరగాయలు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు, పండ్లు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆహార పదార్థాలను ఎంతకాలం నిల్వ ఉంచుతున్నారు, వాటి నాణ్యతను ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు అనే విషయాలను సంబంధిత సిబ్బందిని నుంచి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, రుచి, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా.. ప్రతిరోజూ నిర్ణీత సమయానికి భోజనం పెడుతున్నారా అనే వివరాలను ఆరా తీసారు.

విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు సాయంత్రం అందిస్తున్న స్నాక్స్, నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యార్థులకు ప్రతిరోజూ సమతుల్యమైన, పౌష్టిక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వంటశాల పరిసరాలు, ఆహార పదార్థాల నిల్వ గదులను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, వంటకు తాజా కాయకురాలు, నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు.

ఆహార పదార్థాలను అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వంట చేసే సమయంలోనూ, భోజనం వడ్డించే సమయంలోనూ పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అదేవిధంగా విద్యార్థులకు నిరంతరం శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారం, తాగునీరు, వసతి సౌకర్యాల విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం వసతి గృహంలో విద్యార్థులతో మాట్లాడుతూ సబ్జెక్టులో ప్రావీణ్యం పెంపొందించుకోవాలని, పట్టుదలతో ప్రణాళిక బద్దంగా చదువుకోవాలని సూచించారు. అదేవిధంగా క్రీడల్లో ప్రాతినిధ్యం వహించేలా రాణించాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు తెలిపారు.

ఈ తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి జి.జ్యోతి, వైరా తహసీల్దారు సురేష్, సంబంధిత అధికారులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.