Khammam: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం!
Khammam: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అఖిలపక్ష భేటీ ఫారం-18తో నవంబర్ 1, 2023 నాటికి డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు.
Khammam: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం!
ఖమ్మం: వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో నమోదు ప్రక్రియపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, అర్హతలు, దరఖాస్తు విధానం, గడువును పూర్తిగా అవగాహన చేసుకుని అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే పట్టభద్రులు ఫారం–18 ద్వారా అవసరమైన వివరాలను సమర్పించాలని తెలిపారు. సంబంధిత ధ్రువపత్రాలను గెజిటెడ్ అధికారి లేదా డిజిగ్నేటెడ్ అధికారి ద్వారా ధ్రువీకరించి సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు.
నవంబర్ 1, 2023 నాటికి పట్టభద్రులై ఉండటంతో పాటు, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో స్థానిక నివాసులుగా ఉన్న అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ఓటర్ల జాబితాలో పేరు ఉండటం మాత్రమే ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియకు సరిపోదని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఎన్నికల సంఘం సూచించిన విధానంలో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ పారదర్శకంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా జరిగేలా సంబంధిత అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. అర్హులైన పట్టభద్రులకు ఓటరుగా నమోదు చేసుకునే ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎలక్షన్స్ సిబ్బంది నవీన్, బీజేపీ ప్రతినిధి బి. రవి నాయక్, కాంగ్రెస్ ప్రతినిధి లక్ష్మణ్ అగర్వాల్, బీఆర్‌ఎస్ ప్రతినిధి అన్వర్, ఎస్. ఆనుదీప్, సీపీఐ(ఎంఎల్) ప్రతినిధి బాబూరావు, బీఎస్పీ ప్రతినిధి టి. వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




