Kothagudem: పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి: అంజిరెడ్డి!

Kothagudem: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదును వేగవంతం చేయాలని కొత్తగూడెంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 28 Oct 2026 5:54 PM IST
Kothagudem
X

Kothagudem: పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి: అంజిరెడ్డి!

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లక్ష్మీదేవిపల్లిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన పట్టభద్రుల ఓటరు నమోదు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అంజిరెడ్డి ఓటరు నమోదు లక్ష్యాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో ప్రతి మండలానికి వెయ్యి మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను నమోదు చేయాలని, మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డులోనూ ఓటరు నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. 2023 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. గతంలో పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకున్నవారు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటూ, నవంబర్ 6 వరకు నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

జిల్లాలో బీజేపీకి మూడు లక్షల సభ్యత్వం ఉందని, వారిలో పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. మండల స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను గుర్తించాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై అంజిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు సాగునీరు అందించకుండా ఇతర జిల్లాలకు నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఉద్యోగులు, పెన్షనర్లు సహా వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఉద్యోగులకు డీఏల చెల్లింపుల విషయంలోనూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 31 మంది, బీఆర్ఎస్‌కు ఇద్దరు, సీపీఐకి ఒక ఎమ్మెల్యే ఉన్నారని పేర్కొంటూ, తనను పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ గొంతుకగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల కో-కన్వీనర్ వన్నాల వెంకట రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు పుణ్యం బిక్షపతి, జాటోత్ వెంకన్న నాయక్, జిల్లా ఉపాధ్యక్షురాలు భూక్య దివ్యశ్రీ, చెరుకు భాగ్యలక్ష్మి, జిల్లా కోశాధికారి ముకుంద రెడ్డి, జిల్లా కార్యదర్శి పుణ్యానాయక్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు జుజ్జూరు మోహనకృష్ణ, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు నవీన్, చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్, ముసుకు శ్రీనివాస్ రెడ్డి, శంభు నాయక్, నాయిని శ్రీను, సుచిత్ర పాసి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రహీం, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా హరీష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM