Kothagudem: నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికత కీలకం: ఎస్పీ రోహిత్ రాజు
Kothagudem: నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ విభాగాల తనిఖీలో భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు సూచించారు.
Kothagudem: నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికత కీలకం: ఎస్పీ రోహిత్ రాజు
కొత్తగూడెం: నేర పరిశోధనను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పోలీస్ సిబ్బందికి సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్ విభాగాలను ఆయన సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరికరాలు, వాటి పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఫింగర్ ప్రింట్ విభాగంలో వినియోగిస్తున్న మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్, ఎంసీయూ, నాఫిస్ (NAFIS) తదితర సాంకేతిక వ్యవస్థల పనితీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నేరస్థుల వేలిముద్రల సేకరణ, గుర్తింపు, నేర పరిశోధనలో వాటి ప్రాధాన్యతను పరిశీలించారు.
అదేవిధంగా క్లూస్ టీమ్ విభాగంలో నేరస్థలాల నుంచి శాస్త్రీయ ఆధారాల సేకరణ, వాటి విశ్లేషణ, భద్రపరిచే విధానాలను సమీక్షించారు. ప్రతి కేసులో నాణ్యమైన ఆధారాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు శాస్త్రీయ పరిశోధనా పద్ధతులను అనుసరించడం ద్వారా నేరాలను త్వరితగతిన ఛేదించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కేసుల దర్యాప్తులో ఖచ్చితత్వం, పారదర్శకత, వేగం పెంచేలా సిబ్బంది నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




