Kothagudem: మంత్రాల నెపంతో ఇద్దరు వృద్ధుల దారుణ హత్య.. అటవీ ప్రాంతంలో కలకలం
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలో మంత్రాల నెపంతో ఇద్దరు వృద్ధులను హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన సంచలనం రేపింది.
Kothagudem: మంత్రాల నెపంతో ఇద్దరు వృద్ధుల దారుణ హత్య.. అటవీ ప్రాంతంలో కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరు, ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలో ఇద్దరు వృద్ధుల జంట హత్యల ఘటన వెలుగుచూడటం కలకలం రేపుతోంది. మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు వృద్ధులను హత్య చేసి.. చెక్‌డ్యామ్ సమీపంలో పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. గత నెల రోజులుగా అదృశ్యమైన మడకం భీమయ్య, మాసయ్య మృతదేహాలు అటవీ ప్రాంతంలో బయటపడటంతో ఈ ఘటన సంచలనం రేపింది.
మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ రవీందర్ రెడ్డి పరిశీలించారు. ఈ హత్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న ఐదుగురిని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
మూఢనమ్మకాల కారణంగా ఇద్దరు వృద్ధులు హత్యకు గురయ్యారు.. పూజలు, మంత్రాలు చేస్తున్నారన్న అపనమ్మకంతో కొందరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు.. ఇద్దరు వృద్ధులపై కర్రలతో దాడి చేసి హత్య చేసిన అనంతరం.. మృతదేహాలను చెక్‌డ్యామ్ సమీపంలో పూడ్చిపెట్టి, చెట్ల కొమ్మలతో కప్పివేసినట్లు పోలీసులు గుర్తించారు..
బూసిరాయి గుంపుకు చెందిన మడకం భీమయ్య.. గత నెల 4వ తేదీన బుడుగుల గ్రామంలోని తన బంధువు పెద్ద మాసయ్య ఇంటికి వచ్చారు.. ఈ క్రమంలో గత నెల 7వ తేదీన భీమయ్య, మాసయ్య ఇద్దరూ కలిసి తిరిగి వెళ్తుండగా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది..
తమ కుటుంబ సభ్యుల అనారోగ్యానికి, మరణాలకు వీరు చేస్తున్న పూజలే కారణమని భావించిన కొందరు వ్యక్తులు.. పథకం ప్రకారం దాడి చేసి ఇద్దరినీ హతమార్చినట్లు మణుగూరు సీఐ నాగబాబు వెల్లడించారు.. ఈ ఘటనలో సుమారు ఐదుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు..గత నెల రోజులుగా ఇద్దరు వృద్ధులు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వారి కోసం వెతుకుతున్నారు.. ఈ క్రమంలో చెక్‌డ్యామ్ సమీపంలో వారి మృతదేహాల ఆచూకీ లభ్యమైంది..
మృతుడి కుమార్తె ఎట్టి నందిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..ఈ హత్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న ఐదుగురిని గుర్తించామని..త్వరలోనే వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని సీఐ నాగబాబు స్పష్టం చేశారు..
మూఢనమ్మకాల కారణంగా ఇద్దరు వృద్ధుల హత్యకు గురికావడం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది..ఇలాంటి అపనమ్మకాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది..




