Ashwapuram: దుమ్ముగూడెం ఆనకట్టపై 1 టీఎంసీ నీటి నిల్వకు ముమ్మర ఏర్పాట్లు

Ashwapuram: అమ్మగారిపల్లి వద్ద దుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాలతో 1 టీఎంసీ నీటి నిల్వ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Updated on: 25 Oct 2026 6:44 PM IST
Ashwapuram
X

Ashwapuram: దుమ్ముగూడెం ఆనకట్టపై 1 టీఎంసీ నీటి నిల్వకు ముమ్మర ఏర్పాట్లు

Ashwapuram: ఎల్‌నినో ప్రభావంతో రానున్న కాలంలో ఏర్పడే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

ఆదివారం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామ పరిధిలోని దుమ్ముగూడెం ఆనకట్టను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, సంబంధిత ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

ఆనకట్టపై ఇసుక బస్తాలతో నీటిని నిల్వ చేసేందుకు చేపడుతున్న పనులను పరిశీలించిన మంత్రి, పనుల పురోగతి, గోదావరి నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమ్మగారిపల్లి నుంచి దుమ్ముగూడెం వరకు పడవలో ప్రయాణిస్తూ ఆనకట్ట పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

దుమ్ముగూడెం వైపు ఆనకట్టపై ఇసుక బస్తాలతో చేపడుతున్న పనులను మరింత వేగవంతం చేయాలని, అవసరమైతే అదనపు కార్మికులను నియమించి, పడవలను పెంచి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ , ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంపై వాతావరణ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్న అంచనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

వాతావరణ మార్పులు వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక రంగం, ప్రజారోగ్యం, పశుసంపదపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను భయాందోళనలకు గురిచేయడం తమ ఉద్దేశం కాదని, రానున్న పరిస్థితులను ముందుగానే అర్థం చేసుకుని నష్టాలను నివారించేందుకు ప్రజల్లో అవగాహన, ఆత్మస్థైర్యం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.

ఈ ఏడాది వర్షపాతం లోటు, నదులు, వాగులు, వంకల్లో తగ్గిన నీటి ప్రవాహాలు, రిజర్వాయర్లలో పరిమిత నీటి నిల్వల కారణంగా భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.

అనేక ప్రాంతాల్లో బోర్ల నుంచి నీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రానున్న వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చడం ప్రధాన సవాలుగా మారే అవకాశం ఉందన్నారు. అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వినియోగించుకోవాలని, నీటి వృథాను నివారించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

దుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి గోదావరి నీటిని నిల్వ చేయడం ద్వారా రానున్న వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. ఇంజినీరింగ్ అధికారుల సూచనల మేరకు ఆనకట్టపై సుమారు ఒక మీటర్ ఎత్తున ఇసుక బస్తాల పొరలను ఏర్పాటు చేసి దాదాపు ఒక టీఎంసీ నీటిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

ఈ నీటి నిల్వ ద్వారా తాగునీటి అవసరాలకు అవసరమైన నీటిని అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సాధారణంగా వేసవిలో గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిపోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే నీటిని నిల్వ చేయడం అవసరమని తెలిపారు .

ఆనకట్టపై ఇసుక బస్తాల ఏర్పాటు పనులను వేగవంతం చేసేందుకు రోజుకు 10 వేల నుంచి 15 వేల బస్తాలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సుమారు లక్షన్నర ఇసుక బస్తాలు అవసరం అవుతున్నాయాన్నారు.అవసరాన్ని బట్టి కార్మికుల సంఖ్యను పెంచి, పనులకు ఆటంకం కలగకుండా అదనపు పడవలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వాతావరణ శాఖ వర్ష సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ గోదావరి ప్రవాహంలో వచ్చే మార్పులకు అనుగుణంగా పనులు నిర్వహించాలని, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి ప్రవాహం పెరిగినప్పటికీ చేపట్టిన పనులకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి పథకాలు నిరంతరాయంగా కొనసాగాలంటే నీటి నిల్వలను కాపాడుకోవడం అత్యంత అవసరమని మంత్రి స్పష్టం చేశారు. భద్రాచలంతో పాటు ఇతర ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి పంపిణీని సమన్వయంతో నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఆనకట్ట వద్ద నీటిని నిల్వ చేస్తూనే అవసరమైన ప్రాంతాలకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఒక టీఎంసీ నీటి నిల్వ లక్ష్యాన్ని సాధించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావం పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు రబీ సాగులో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, భూగర్భ జలాల లభ్యత, విద్యుత్ సరఫరా పరిస్థితులను అంచనా వేసుకుని అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని కోరారు.

తక్కువ నీటితో పండే కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భూమిలో ఉన్న తేమ, నీటి లభ్యత ఆధారంగా సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని, అధిక నీటి అవసరం ఉండే పంటల సాగు విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ప్రస్తుత సీజన్‌లో అందుబాటులో ఉన్న గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టుకు నీటిని అందించడంతో పాటు వైరా, లంకసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

తుమ్మల చెరువు, సింగభూపాలం, అన్నదైవం, మూకమామిడి వంటి చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాల పెంపు, పశువులకు నీటి లభ్యత, రైతుల సాగు అవసరాలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

రైతులకు అవసరమైన విద్యుత్‌ను అందించడంతో పాటు పండించిన పంటలను కొనుగోలు చేయడం, రైతు భరోసా వంటి సహాయక చర్యలను కొనసాగిస్తూ రైతాంగానికి అండగా నిలుస్తున్నామని మంత్రి తెలిపారు. రానున్న కాలంలో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అఖిలపక్షంతో చర్చించి, అవసరమైన సహాయ సహకారాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద ప్రజలకు ఉపయోగపడే పనులను చేపట్టాలని మంత్రి సూచించారు. పంట కాలువల మరమ్మతులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, చెరువుల్లో పూడికతీత, గ్రామీణ రహదారుల అభివృద్ధి వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గ్రామీణ ఉపాధిని పెంచడంతో పాటు భవిష్యత్తులో నీటి వనరులను మెరుగుపరుచుకోవచ్చన్నారు.

పశువులకు, అవసరమైన చోట అడవి జంతువులకు కూడా నీటి లభ్యత కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొంటూనే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు.

నీటి పొదుపు, విద్యుత్ పొదుపు, ప్రజారోగ్య పరిరక్షణపై గ్రామస్థాయి నుంచి విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. రైతు వేదికలు, గ్రామసభల ద్వారా రైతులకు వాతావరణ పరిస్థితులు, పంటల ఎంపిక, నీటి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, రెవెన్యూ శాఖల అధికారులు గ్రామస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవసరమైన సూచనలు అందించాలని ఆదేశించారు.

రానున్న కాలంలో నీటి కొరత తీవ్రం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు, కూడా భాగస్వాములు కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి పొదుపు, రైతులకు అవగాహన కల్పించడం వంటి అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

దుమ్ముగూడెం ఆనకట్టపై ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసే లక్ష్యాన్ని సాధించేందుకు సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ శాఖా ఎస్ ఈ, అమ్మగారి పల్లి సర్పంచ్ కవిత, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.