Kothagudem: కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ మేరకు సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలి!
Kothagudem: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు సీపీఎస్‌ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ధర్మదీక్ష.
Kothagudem: కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ మేరకు సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలి!
Kothagudem: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్‌సీపీఎస్‌ఈయూ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు తుక్కాని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఎస్ రద్దు హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరుతూ మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ధర్నా చౌక్‌లో సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహిక సెలవులు పెట్టి ధర్మదీక్ష చేపట్టారు.
టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల కేంద్రాల్లో నిర్వహించిన ఈ ఆందోళనలో భాగంగా భద్రాద్రి జిల్లాలో సుమారు 2 వేల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు తుక్కాని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. 2023 సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిందని, ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని పొందుపరిచిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా సీపీఎస్ రద్దు దిశగా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఈ నేపథ్యంలో జూలై 11న టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో భద్రాచలం రాములవారి పాదాల చెంత నుంచి ప్రారంభమైన జనజాగరణ బస్సు యాత్ర రాష్ట్రంలోని 33 జిల్లాల మీదుగా కొనసాగిందన్నారు.
ఈ యాత్రలో భాగంగా సుమారు వంద మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి సీపీఎస్ రద్దు చేయాలని వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఆగస్టు 23న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులతో జనజాగరణ సభ నిర్వహించామని చెప్పారు.
ఆ సభలో ప్రకటించిన కార్యాచరణలో భాగంగా నవంబర్ 17లోపు ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు పెట్టి ధర్మదీక్షలు చేపడతామని హెచ్చరించినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతోనే నేడు ఈ ఆందోళన చేపట్టాల్సి వచ్చిందన్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ధర్మదీక్షలో మూడు ప్రధాన తీర్మానాలు
ధర్మదీక్ష సభలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల చప్పట్ల మధ్య పలు తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని, సీపీఎస్ రద్దు కోసం ఏర్పాటు చేసే కమిటీలో టీఎస్‌సీపీఎస్‌ఈయూకు ప్రాతినిధ్యం కల్పించాలని తీర్మానించారు.
న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద పదవీ విరమణ పొందిన సీపీఎస్ ఉద్యోగులకు కూడా వైద్య సేవలు కొనసాగించాలని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ట్రస్ట్ బోర్డులో సీపీఎస్ సంఘానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలతో పాటు భవిష్యత్తులో రావాల్సిన డీఏ, పీఆర్సీ బకాయిలను కూడా ఒకేసారి నగదు రూపంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాలు ఆమోదించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర ఐటీ సెల్ కార్యదర్శి గోరింట్ల సురేష్, రాష్ట్ర కార్యదర్శి నాగు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, మహిళా ఉపాధ్యక్షురాలు మంజుశ్రీతో పాటు 23 మండలాల బాధ్యులు పాల్గొన్నారు. అలాగే టీఎస్‌టిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాములునాయక్, టీజీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్,
పీఆర్టీయూ టీజీ జిల్లా అధ్యక్షుడు రవి, టీజీఎల్ఏ జిల్లా అధ్యక్షుడు, టీజీవో ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ సెక్రటరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కిరణ్, సతీష్, పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు నరసయ్య, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, కళావిజ్ఞాన వేదిక అధ్యక్షుడు వెంకట ముత్యం, ఐసీడీఎస్ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి,
ఏఎన్‌ఎంల అధ్యక్షురాలు ఉమారాణి, టీపీ యూఎస్ జిల్లా అధ్యక్షుడు సురేష్, ఆర్‌యూపీపీ జిల్లా అధ్యక్షుడు రామ్‌సింగ్, ఏటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు, టీఎన్జీవో జిల్లా నాయకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




