Kothagudem: అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నాటుసారా స్థావరాలపై రెండు రాష్ట్రాల ఎక్సైజ్ దాడులు!
Kothagudem: తెలంగాణ-ఏపీ సరిహద్దులో ఎక్సైజ్ అధికారుల సంయుక్త దాడులు. 3200 లీటర్ల బెల్లం వాష్ ధ్వంసం, 2 కేసులు నమోదు.
Kothagudem: అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నాటుసారా స్థావరాలపై రెండు రాష్ట్రాల ఎక్సైజ్ దాడులు!
Kothagudem: తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ నాటుసారా తయారీని అరికట్టేందుకు రెండు రాష్ట్రాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 3,200 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం పులుసు (వాష్)ను ధ్వంసం చేయడంతో పాటు రెండు కేసులు నమోదు చేశారు.
ఖమ్మం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఖమ్మం ఏసీ ఎన్ఫోర్స్మెంట్, కొత్తగూడెం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్లోని యటపాక మండలం, చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గుండువారిగూడెం, పిచుకలపాడు గ్రామాల్లో ఈ తనిఖీలు చేపట్టారు.
తెలంగాణ నుంచి ఖమ్మం ఏసీ ఎన్ఫోర్స్మెంట్ నరేందర్, కొత్తగూడెం డీటీఎఫ్ బృందం, మణుగూరు ఎస్హెచ్ఓ నాగేశ్వర్ రావు, పాల్వంచ ఎస్హెచ్ఓ అశోక్ కుమార్, భద్రాచలం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి. కిష్టయ్య పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అనకాపల్లి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, రంపచోడవరం డీటీఎఫ్ బృందం, చింతూరు ఎస్హెచ్ఓ విజయలక్ష్మి, యటపాక పోలీస్ స్టేషన్ సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.
దాడుల అనంతరం గ్రామస్థులకు నాటుసారా వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, కుటుంబాలపై దాని ప్రభావం గురించి అధికారులు అవగాహన కల్పించారు. నాటుసారా తయారీ, విక్రయం, నిల్వ, రవాణా వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. అక్రమ తయారీకి సంబంధించిన సమాచారం తెలిస్తే అధికారులకు తెలియజేసి సహకరించాలని కోరారు.
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ నాటుసారా తయారీని అరికట్టడం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం లక్ష్యంగా ఈ సంయుక్త దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.




