Kothagudem: ఇందిరమ్మ ఇళ్లలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి!
Kothagudem: ఇందిరమ్మ ఇళ్లలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కోటా కల్పించాలి లక్కీ డ్రాలో ఇళ్లు దక్కకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత.
Kothagudem: ఇందిరమ్మ ఇళ్లలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి!
కొత్తగూడెం: కొత్తగూడెంలో ఇటీవల నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాలో ట్రాన్స్‌జెండర్ సమాజానికి చెందిన ఒక్కరికి కూడా ఇల్లు కేటాయించకపోవడంతో తమకు ప్రత్యేక అవకాశం కల్పించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రాన్స్‌జెండర్ సమాజ సభ్యులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
సాధారణ లబ్ధిదారులతో సమానంగా లక్కీ డ్రాలో అవకాశం కల్పించడం వల్ల తమ జనాభా సంఖ్య తక్కువగా ఉండటంతో ఇల్లు పొందే అవకాశం మరింత తగ్గిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమాజంలో చాలామంది కుటుంబాల ఆదరణకు దూరంగా, సొంత ఇళ్లు లేకుండా, ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నారని తెలిపారు.
ఇల్లు తమకు కేవలం ప్రభుత్వ పథకం కాదని, సురక్షితంగా, గౌరవంగా జీవించేందుకు అవసరమైన ఆశ్రయమని పేర్కొన్నారు. తమ ప్రత్యేక పరిస్థితులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ట్రాన్స్‌జెండర్ సమాజానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అర్హులకు ప్రత్యేక కోటా ద్వారా ఇళ్లు కేటాయించడం లేదా ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలను విన్న జిల్లా కలెక్టర్ ఆధార్ కార్డు వివరాలను అందజేసి మున్సిపల్ కమిషనర్‌ను కలవాలని సూచించినట్లు వారు తెలిపారు. అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు. ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు లాలస, శుభలేఖ గంగ, పాల్వంచ మండల అధ్యక్షురాలు వెన్నెల, అపూర్వ, హర్షిత, మాళవిక, లలిత తదితరులు పాల్గొన్నారు.




