Nageswara Rao: రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తుమ్మల వినతి!
Nageswara Rao: తెలంగాణ ప్రయోజనాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 8 కీలక ప్రతిపాదనలు సమర్పించారు. కోల్ ఇండియా సీఎస్సార్ నిధులు కోరారు.
Nageswara Rao: రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తుమ్మల వినతి!
Nageswara Rao: రాష్ట్ర అభివృద్ధి.. రైతుల సంక్షేమం.. పారిశ్రామిక ప్రగతి.. గిరిజన ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు.. విద్య, పరిశోధన రంగాల బలోపేతమే లక్ష్యంగా తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ వేదికగా కీలక ప్రయత్నాలు చేశారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని శుక్రవారం కలిసి రాష్ట్రానికి సంబంధించిన ఎనిమిది ప్రధాన అంశాలపై వినతిపత్రాలు అందజేశారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపాలని, కీలక ప్రాజెక్టులకు వేగం పెంచాలని కోరారు. ముఖ్యంగా కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయ అభివృద్ధికి కోల్ ఇండియా సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.100 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించడంతోపాటు కోల్ ఇండియా ఎండీతో అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
యాదాద్రి విద్యుత్ కేంద్రానికి బొగ్గు భరోసా
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అవసరమైన బొగ్గును ముఖ్యమంత్రి కోరిన విధంగా మహానది బొగ్గు క్షేత్రాల నుంచి కేటాయించాలని తుమ్మల కోరారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలకమైన ఈ కేంద్రానికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సింగరేణికి సత్తుపల్లి బ్లాక్-III
సత్తుపల్లి బ్లాక్-III బొగ్గు గనిని సింగరేణి కాలరీస్‌కు కేటాయించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే సింగరేణి నిర్వహిస్తున్న గనులకు సమీపంలో ఈ బ్లాక్ ఉండటంతో అందుబాటులోని మౌలిక వసతులను వినియోగించుకోవచ్చని వివరించారు. తద్వారా తవ్వకాలు త్వరగా ప్రారంభించడంతోపాటు అదనపు భూసేకరణ అవసరాన్ని, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించే అవకాశముంటుందని పేర్కొన్నారు.
ఆర్ఎఫ్సీఎల్ సమస్యకు శాశ్వత పరిష్కారం
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)లో సాంకేతిక సమస్యలతో ఉత్పత్తి నిలిచిపోతుండటంతో రాష్ట్రంలో యూరియా సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని మంత్రి వివరించారు. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఎదురైన అంతరాయాలు రబీ సీజన్లో రైతులకు ఎరువుల లభ్యతపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జె.పి.నడ్డాతో చర్చించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా యూరియా కేటాయింపులు ఉండేలా చూడాలని కోరారు.
వర్సిటీకి రూ.100 కోట్ల సీఎస్ఆర్ నిధులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయి విద్యా, పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కోల్ ఇండియా సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.100 కోట్లు మంజూరు చేయాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఎర్త్ సైన్సెస్, మైనింగ్, జియాలజీ, పర్యావరణ అధ్యయనాల్లో ఉన్నత ప్రమాణాలతో పరిశోధనలు చేపట్టేందుకు ఆధునిక ప్రయోగశాలలు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని తెలిపారు. ఈ నిధులు అందుబాటులోకి వస్తే విశ్వవిద్యాలయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని వివరించారు.
కొత్తగూడెంలో విమానాశ్రయానికి అనుమతులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కోరారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే గిరిజన ప్రాంతాలకు అనుసంధానం మెరుగుపడటంతోపాటు పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. విమానాశ్రయాల ప్రాధికార సంస్థ పరిశీలించిన స్థలాలపై సాంకేతిక నివేదికను త్వరగా ఖరారు చేసి, పౌర విమానయాన శాఖతో సమన్వయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
రైల్వే లైన్లకు వేగం పెంచాలి
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కీలక రైల్వే ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించేలా రైల్వే శాఖతో సమన్వయం చేయాలని తుమ్మల కోరారు. సత్తుపల్లి–కొవ్వూరు, పెనుబల్లి–కొండపల్లి కొత్త రైల్వే లైన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ మార్గాలు అందుబాటులోకి వస్తే వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక సరుకుల రవాణా సులభమవుతుందని, ఖమ్మం ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్‌తో రైలు అనుసంధానం మెరుగుపడి వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.
పుష్కరాల నాటికి సారపాక వరకు రైలు
ఇప్పటికే మంజూరైన పాండురంగాపురం–మల్కన్‌గిరి రైల్వే లైన్ పనులను వేగవంతం చేసి, వచ్చే ఏడాది భద్రాచలంలో జరగనున్న గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యేలోగా భద్రాచలం సమీపంలోని సారపాక వరకు రైల్వే సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మార్గం పూర్తయితే గిరిజన, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు, శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి, పుష్కరాలకు వచ్చే భక్తులకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు.
సానుకూలంగా స్పందించిన కిషన్‌రెడ్డి
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తుమ్మల సమర్పించిన వినతులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. సంబంధిత శాఖల మంత్రులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి సీఎస్ఆర్ నిధుల మంజూరు అంశంపై తక్షణమే స్పందిస్తూ కోల్ ఇండియా ఎండీతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారం, కీలక ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.




