Khammam: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాలో 100% నమోదు లక్ష్యం: అదనపు కలెక్టర్!

Khammam: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హులైన ప్రతి కుటుంబాన్ని నమోదు చేయాలని, నవంబర్ 19 నుంచి డిసెంబర్ 19 వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 17 Nov 2026 10:56 AM IST
Khammam
X

Khammam: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాలో 100% నమోదు లక్ష్యం: అదనపు కలెక్టర్!

Khammam: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హులైన ప్రతి కుటుంబాన్ని నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. 100 శాతం నమోదు లక్ష్యంగా పనిచేయాలని, అర్హత కలిగిన ఒక్క కుటుంబం కూడా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

సోమవారం ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు,ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, ఏపిఏం, ఎపి ఏం ల తో పథకం అమలుకు చేపట్టాల్సిన చర్యలు, నమోదు శిబిరాల నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి అనూషతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, కుటుంబానికి ప్రధాన జీవనాధారంగా ఉన్న సంపాదనపరుడు అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా 5 లక్షల జీవిత బీమా పరిహారం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పథక మార్గదర్శకాల ప్రకారం అర్హులైన కుటుంబాలు నమోదు చేసుకోవచ్చని, కులం, ఆదాయం, ఏపీఎల్, బీపీఎల్ వంటి అంశాలతో సంబంధం లేకుండా అర్హతలను పరిశీలించి లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు.

బీమా పొందే వ్యక్తి వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలని, ఇందుకోసం 19-11-1967 నుంచి 18-11-2008 మధ్య జన్మించిన వారు అర్హులని తెలిపారు. కుటుంబ సభ్యులు తమలో ఎవరి పేరు మీద బీమా చేయించుకోవాలనేది నిర్ణయించుకోవచ్చని, నామినీగా ఒకరి కంటే ఎక్కువ మందిని ఎంపిక చేసుకొని భార్య, కుమారుడు, కుమార్తె తదితరులకు నిర్దిష్ట శాతాల్లో బీమా పరిహారం కేటాయించే అవకాశం ఉందని వివరించారు.

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని, డిసెంబర్ 19 వరకు నెల రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ, ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి శిబిరానికి ఒక బాధ్యతాయుతమైన అధికారిని, ప్రతి నాలుగు గ్రామ పంచాయతీలు లేదా నాలుగు వార్డులకు ఒక సూపర్వైజరీ అధికారిని నియమించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేని చోట ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలకు సూచించారు.

శిబిరాల్లో కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్, టెంట్, కుర్చీలు, తాగునీరు, మైక్ వంటి సదుపాయాలతో పాటు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పాటు దరఖాస్తుదారులకు మార్గనిర్దేశం చేసే సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీ మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అన్నారు .

రేషన్ కార్డుల ఆధారంగా అందుబాటులో ఉండే ప్రీ-ఫిల్డ్ డేటాను ఉపయోగించుకొని దరఖాస్తులు నింపాలని, రేషన్ కార్డు లేని కుటుంబాల వివరాలను ప్రత్యేక ఖాళీ దరఖాస్తుల ద్వారా సేకరించాలని సూచించారు. బీమాదారుడి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, నామినీల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని, నామినీ మైనర్ అయితే సంరక్షకుడి వివరాలను కూడా పొందుపరచాలని తెలిపారు. దరఖాస్తులో నమోదైన వివరాలను బీమాదారుడికి వివరించిన తర్వాత తప్పనిసరిగా ఆయన సంతకం తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ-డీఎం సైదేశ్వరరావు సమావేశంలో ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా చేసి చూపించారు. నమూనా దరఖాస్తును నింపుతూ ప్రీ-ఫిల్డ్ డేటా పరిశీలన, బీమాదారుడు, నామినీల వివరాల నమోదు విధానాన్ని వివరించారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. నమోదైన దరఖాస్తులను స్కాన్ చేసి సంబంధిత బీమా సంస్థకు పంపడంతో పాటు, అసలు దరఖాస్తులను ఎంపీడీవో కార్యాలయంలో భద్రపరచాలని సూచించారు.

నమోదు కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు నవంబర్ 17, 18 తేదీల్లో మైక్ ప్రచారం, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా, పత్రికా ప్రకటనల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని విద్యా చందన సూచించారు. గ్రామ సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి సమాచారం చేరేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ప్రభుత్వం కల్పిస్తున్న 5 లక్షల రూపాయల జీవిత బీమా భద్రతను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని, నవంబర్ 19 నుంచి నిర్వహించే ప్రత్యేక నమోదు శిబిరాలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలతో హాజరై తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ కోరారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.