Khammam: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు.. నవంబర్ 6 తర్వాత కూడా అవకాశం!

Khammam: వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు నవంబర్ 6 తర్వాత కూడా కొనసాగుతుందని అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 1 Nov 2026 8:12 AM IST
Khammam
X

Khammam: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు.. నవంబర్ 6 తర్వాత కూడా అవకాశం!

Khammam: నవంబర్ 6 తర్వాత కూడా వరంగల్– నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అవకాశం ఉందని అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ దివాకర్ టి ఎస్ తో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి సమీక్షించారు.

ఈ సందర్భంగా అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో మంచి పురోగతి సాధించారని అధికారులను అభినందించారు. అయితే నవంబర్ 6 చివరి తేదీగా భావించి రాజకీయ పార్టీల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, మరోవైపు అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా వేగవంతం కావాల్సి ఉందని అన్నారు.

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఫారం-18 దరఖాస్తుల స్వీకరణతో పాటు వాటి పరిశీలనను వేగవంతం చేయాలని సూచించారు.

2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరు నమోదుకు అర్హులని, అదే తేదీన డిగ్రీ పరీక్షల ఫలితాలు ప్రకటించబడిన వారు కూడా అర్హులేనని తెలిపారు. ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ అందుబాటులో లేని సందర్భాల్లో సంబంధిత విద్యాసంస్థ అధిపతి ధృవీకరించిన సర్టిఫికెట్‌ను కూడా పరిశీలనకు స్వీకరించవచ్చని తెలిపారు. విద్యార్హత ధృవీకరణతో పాటు దరఖాస్తుదారుల సాధారణ నివాస స్థితిని క్షేత్ర స్థాయిలో తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు.

ఖమ్మం జిల్లాలో ఎస్ఐఆర్-2026 ప్రక్రియను అధికారులు, బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) సమర్థవంతంగా నిర్వహించిన తీరును అభినందించారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం బీఎల్ఓలందరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై దృష్టి సారించి, క్షేత్రస్థాయిలో నివాస ధృవీకరణను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు నవంబర్ 6తో ముగిసిపోదని, ఆ తేదీ తర్వాత కూడా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం డిసెంబర్ 10, 2026 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల రూపంలో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు కూడా ఫారం-18 దరఖాస్తులు సమర్పించవచ్చని, నిబంధనల ప్రకారం వాటిని స్వీకరించడం జరుగుతుందని వివరించారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు, పట్టభద్రులకు, క్షేత్రస్థాయి ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు.

బీఎల్ఓల ప్రధాన బాధ్యత దరఖాస్తుదారుల నివాస స్థితిని క్షేత్రస్థాయిలో ధృవీకరించడమేనని తెలిపారు. ఒకే ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో ఆన్‌లైన్ దరఖాస్తులు రావడం, ఒకే ఐడీ ద్వారా వందల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించడం వంటి సందర్భాల్లో ప్రత్యేక అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు.

ఒకే ఐడీ ద్వారా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినప్పుడు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, వాస్తవాలను ధృవీకరించిన తర్వాతే ఆమోదించాలని సూచించారు. అనుమానాస్పద దరఖాస్తుల విషయంలో క్షేత్రస్థాయి విచారణ చేపడుతూనే, అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావచ్చనే సానుకూల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.

ఫారం-18 దరఖాస్తుల పరిశీలన అనంతరం పోలింగ్ కేంద్రాల కేటాయింపును కూడా అత్యంత జాగ్రత్తగా ప్రణాళిక రూపొందించి చేపట్టాలని సూచించారు. ఓటర్లకు సౌకర్యంగా ఉండేలా పోలింగ్ కేంద్రం ఉండే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలని, అవసరమైన జంబో బ్యాలెట్ బాక్సులను ముందుగానే గుర్తించాలని తెలిపారు.

ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదు కావడం చట్టరీత్యా నేరమని, డబుల్ ఓటు నమోదు చేసుకునే వారిపై శిక్షార్హమైన చర్యలు ఉంటాయనే విషయాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు.

జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు అర్హులైన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.

2024 ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా నుంచి మొత్తం 83,879 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారని, ప్రస్తుత నమోదు ప్రక్రియలో ఇప్పటివరకు 73,898 దరఖాస్తులు అందాయని కలెక్టర్ తెలిపారు. ఈసారి జిల్లాలో 1.5 లక్షలకు పైగా పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ, వారి సూచనలు, సలహాలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి అర్హుడైన పట్టభద్రుడు ప్రస్తుత ప్రక్రియలో తప్పని సరిగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.

2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ముఖ్యంగా 25 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల పట్టభద్రులను గుర్తించి, వారికి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటరు నమోదుకు సంబంధించి సందేహాలను నివృత్తి చేసేందుకు కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

నవంబర్ 6 తర్వాత కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అవకాశం ఉందనే సమాచారాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి నివాస స్థితిని ధృవీకరించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల కేటాయింపును కూడా ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేలా ముందస్తు ప్రణాళికతో చేపట్టాలని తెలిపారు.

అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఫారం-18 దరఖాస్తుల విచారణ బాధ్యతలను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (ఆర్ఐలు), సీనియర్ అసిస్టెంట్ కేడర్ సిబ్బందికి అప్పగించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో అందిన ఫారం-18 దరఖాస్తులను ప్రతిరోజూ డౌన్‌లోడ్ చేసుకొని పరిశీలించాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.

క్షేత్రస్థాయి అధికారులు బూత్ స్థాయి అధికారుల సహకారంతో దరఖాస్తుదారుల ఒరిజినల్ సర్టిఫికెట్లను, వారు సంబంధిత ప్రాంతంలో సాధారణ నివాసితులుగా ఉన్నారా లేదా అనే అంశాన్ని పరిశీలించి విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం దరఖాస్తుల కేటాయింపు కోసం 118 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవంబర్ 6, 2026 వరకు అందే దరఖాస్తుల ఆధారంగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ప్రతిపాదనలను నవంబర్ 10, 2026లోగా సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితా ముసాయిదాను నవంబర్ 25, 2026న ప్రచురించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముసాయిదా జాబితాపై డిసెంబర్ 10, 2026 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను డిసెంబర్ 25, 2026లోగా పరిష్కరించి, డిసెంబర్ 30, 2026న తుది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు వివరించారు.

ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ డీ. వేణుగోపాల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, కొత్తగూడెం ఆర్డీవో మధు, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ ఎం.ఏ. రాజు, డిటి అన్సారీ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.