Kothagudem: క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట: మంత్రి పొంగులేటి!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో బుధవారం ముగిసిన రాష్ట్రస్థాయి అండర్-17 వాలీబాల్ పోటీల ముగింపు వేడుకల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 25 Nov 2026 9:34 PM IST
Kothagudem
X

Kothagudem: క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట: మంత్రి పొంగులేటి!

Bhadradri Kothagudem: చర్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌-17 బాలుర వాలీబాల్ పోటీల ముగింపు వేడుకల్లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, క్రీడాకారులను ఆర్థికంగా, ఉద్యోగ అవకాశాల పరంగా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో క్రీడారంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నారని అన్నారు .

ఈ పర్యటనలో తొలుత కుదునూరు గ్రామంలో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.1.50 కోట్ల నిర్మాణ వ్యయంతో చేపట్టనున్న గిరిజన బాలికల వసతి గృహ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

అనంతరం చర్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌-17 బాలుర వాలీబాల్ పోటీల ముగింపు వేడుకల్లో పాల్గొని నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ప్రారంభించి వీక్షించారు. పోటీల్లో విజయం సాధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టును అభినందించారు. విజేతలు, రన్నరప్ జట్లతో పాటు మూడో స్థానం కోసం జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోటీపడటమే కాకుండా ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లో క్రీడారంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో రాణించే వారికి ఆర్థిక సహకారంతో పాటు ఉద్యోగ అవకాశాల్లోనూ ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఖేలో ఇండియా కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

మారుమూల గిరిజన ప్రాంతమైన చర్లలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి అన్నారు. గతంలో ఈ ప్రాంతానికి రావాలంటే అనేక ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించే స్థాయికి ప్రాంతం చేరడం సంతోషకరమన్నారు. యువత చెడు వ్యసనాలకు, ఇతర ఆకర్షణలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంపొందించుకునేలా క్రీడా మైదానం ఏర్పాటు చేయడంలో కృషి చేసిన పోలీసు అధికారులను, వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, గెలిచినవారు మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని, ఓడిపోయినవారు నిరుత్సాహపడకుండా పట్టుదలతో సాధన కొనసాగించాలని సూచించారు. అలలు ఎగసిపడి మళ్లీ కిందకు పడినా వాటి స్వభావం మారనట్లే, క్రీడాకారులు కూడా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అన్నారు. వాలీబాల్‌తో పాటు అన్ని క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మాట్లాడుతూ, చర్ల వంటి మారుమూల ప్రాంతంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. తన ఆహ్వానం మేరకు మారుమూల ప్రాంతానికి విచ్చేసి క్రీడాకారులను ప్రోత్సహించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని యువతలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని అన్నారు. చర్ల ప్రాంతంలో వైద్య సదుపాయాల అభివృద్ధికి డయాలసిస్ కేంద్రం, అంబులెన్స్, వైద్య సిబ్బంది ఏర్పాటు చేయడంతో పాటు ఆసుపత్రి భవన నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. క్రీడలు ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తాయని తెలిపారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, చర్లలో రాష్ట్రస్థాయి అండర్‌-17 వాలీబాల్ పోటీలు నిర్వహించడం జిల్లాకు గర్వకారణమన్నారు. వివిధ జిల్లాల నుంచి సుమారు 120 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. నిరంతర సాధన, క్రమశిక్షణ, కోచ్‌ల మార్గదర్శకత్వంతో రాష్ట్రస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఆర్చరీ వంటి క్రీడల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి తగిన శిక్షణ అందిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా ద్వారా కూడా అవకాశాలు ఉన్నాయని వివరించారు.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, చర్ల ప్రాంత యువత నక్సలిజం, చెడు వ్యసనాల వైపు ఆకర్షితులు కాకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో తాను ఏఎస్పీగా ఉన్న సమయంలో క్రీడా మైదానం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. అప్పట్లో అటవీ ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో నేడు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్థానిక రైతుల సహకారంతో మైదానాన్ని విస్తరించి పోటీలకు అనువుగా తీర్చిదిద్దినట్లు వివరించారు. మైదానం అభివృద్ధి, పోటీల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపిన స్థానిక సీఐ రాజువర్మ, డీఎస్పీ, పోలీసు సిబ్బంది కృషిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, క్రీడా ఉపాధ్యాయులు, కోచ్‌లు, రిఫరీలు, క్రీడాకారులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM