Kothagudem: గిరిజన వ్యతిరేక విధానాలు వీడాలి: భూక్యా వీరభద్రం!
Kothagudem: కొత్తగూడెంలో జరిగిన తెలంగాణ గిరిజన సంఘం జిల్లా రెండో మహాసభలో చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు.
Kothagudem: గిరిజన వ్యతిరేక విధానాలు వీడాలి: భూక్యా వీరభద్రం!
కొత్తగూడెం, అక్టోబర్ 7, 2026: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్‌లోని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు.
తెలంగాణ గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండో మహాసభ బుధవారం కొత్తగూడెంలోని యూటీఎఫ్ భవన్‌లో బానోతు మధు, కవిత అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన భూక్యా వీరభద్రం మాట్లాడుతూ గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ గిరిజన సంఘం నిరంతరం పోరాడుతుందని అన్నారు.
గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడటంతో పాటు పోడు భూములకు పట్టాలు, అటవీ హక్కుల చట్టం అమలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి వంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను కాగితాలకే పరిమితం చేయకుండా కార్యరూపంలో అమలు చేయాలని కోరారు.
మహాసభ ప్రారంభానికి ముందు తెలంగాణ గిరిజన సంఘం జెండాను సీనియర్ నాయకులు, సుజాతనగర్ మాజీ సర్పంచ్ కున్సోత్ ధర్మా నాయక్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో 21 మందితో నూతన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వాంకుడోత్ అమర్ సింగ్ నాయక్, కున్సోత్ షణ్ముఖ నాయక్ ఎన్నికయ్యారు.
అక్టోబర్ 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులను, కార్యకర్తలను సమీకరించాలని మహాసభ తీర్మానించింది.




