Chintoor: ఎటపాకలో కూటమికి షాక్: స్వతంత్రులుగా పోటీ!
Chintoor: ఎటపాక జెడ్పీటీసీ స్థానంలో సైకిల్, గాజు గ్లాసు గుర్తులు గల్లంతవ్వడంతో పాయం దేవి, ఉబ్బా సుస్మిత స్వతంత్రులుగా బరిలోకి దిగడం గందరగోళానికి దారితీసింది.
Chintoor: ఎటపాకలో కూటమికి షాక్: స్వతంత్రులుగా పోటీ!
Chintoor: ఎటపాక జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. ఒకే స్థానానికి కూటమి తరపున ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలవడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.
అసలేం జరిగింది?
తొలుత తెలుగుదేశం పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పాయం దేవి నామినేషన్ వేశారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎటపాక జెడ్పీటీసీ అభ్యర్థి ఉబ్బా సుస్మిత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున కీలక పరిణామం చోటుచేసుకుంది. సుస్మిత జనసేన పార్టీలో చేరి బీ-ఫామ్ తెచ్చుకున్నారు. అయితే టీడీపీ తరపున నామినేషన్ వేసిన పాయం దేవికి టీడీపీ నుంచి బీ-ఫామ్ రాలేదు.
సాంకేతిక లోపం... గుర్తులు గల్లంతు
జనసేన బీ-ఫామ్ ఉన్నప్పటికీ, సుస్మిత ముందుగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం వల్ల సాంకేతిక కారణాలతో అధికారులు జనసేన గుర్తు గాజు గ్లాసును కేటాయించలేదు. అదే విధంగా బీ-ఫామ్ రాకపోవడంతో పాయం దేవి కూడా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీలో నిలిచారు. దీంతో ఇద్దరికీ పార్టీ గుర్తులు కాకుండా స్వతంత్ర గుర్తులను అధికారులు కేటాయించారు.
ప్రచారంలో రెండు వర్గాలు :
ప్రస్తుతం ఎటపాక జెడ్పీటీసీ బరిలో కూటమి తరపున ఇద్దరు అభ్యర్థులు ఉండడంతో కూటమి నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం పాయం దేవికి, మరో వర్గం సుస్మితకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిత్రధర్మం పాటించాలని, వ్యతిరేకించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ, ఎటపాకలో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ఆర్సీపీకి కలిసొచ్చేనా?
మరోవైపు ఎటపాక జెడ్పీటీసీ స్థానానికి సీపీఎం, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఉమ్మడి అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీకి చెందిన కాక కామేశ్వరిని బరిలో నిలిపారు. కూటమిలోని వర్గ పోరుతో ఈ జెడ్పీటీసీ పీఠాన్ని వైఎస్ఆర్సీపీ సులభంగా కైవసం చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.




