Sathupalli: సత్తుపల్లి, అశ్వారావుపేటలలో రూ.300 కోట్లతో 5,000 ఉచిత ఇళ్లు!
Sathupalli: సత్తుపల్లి, అశ్వారావుపేటలలో రూ. 300 కోట్లతో తాన్లా ఫౌండేషన్ 5,000 ఇళ్ల నిర్మాణం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి గంగారంలో ఉచిత ఆరోగ్య కేంద్రం సందర్శన.
Sathupalli: సత్తుపల్లి, అశ్వారావుపేటలలో రూ.300 కోట్లతో 5,000 ఉచిత ఇళ్లు!
సత్తుపల్లి: అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు తాన్ల ఫౌండేషన్ ఉదయ్ కుమార్ రెడ్డి దాతృత్వంతో 300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 5,000 ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి తెలిపారు. సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారంలో తాన్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రామీణ ఆరోగ్య కేంద్రం, లాబరేటరీలను మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, సత్తుపల్లి, అశ్వరావుపేట శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద్, జారే ఆదినారాయణ లతో కలిసి సందర్శించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే, తాన్లా ఫౌండేషన్ నల్ల ఉదయ్ కుమార్ రెడ్డి తన సొంత నిధులతో సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో 5,000 ఇళ్లను నిర్మించి ఇస్తానని మాట ఇచ్చారని తెలిపారు. దీనికి సంబంధించి రాబోయే దసరా పండుగ సందర్భంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద్, ఆదినారాయణ లతో సమన్వయం చేసుకుని అర్హులైన నిరుపేదలకు స్థలాలు కేటాయించే ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సత్యసాయి ట్రస్ట్ ద్వారా నారాయణపురం గ్రామంలో పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలందించేందుకు క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని మంత్రి అన్నారు. పేదలకు ఆరోగ్యాన్ని అందించే ఇలాంటి ఆసుపత్రులు, ఫౌండేషన్ల సేవలకు ప్రభుత్వ తరఫున ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం, సాయం అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ సంపాదించిన సొమ్మును సమాజ శ్రేయస్సు కోసం, పదిమందికి ఉపయోగపడే విధంగా ఖర్చు చేయడం ప్రశంసనీయమని అన్నారు. నేటి కాలంలో బిపి, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి నెల రూ. 3,000 నుండి రూ. 5,000 వరకు మందులకే వెచ్చించడం సామాన్య కుటుంబాలకు పెద్ద భారంగా మారిందని, కేవలం 5 నెలల వ్యవధిలోనే దాదాపు రూ. 9 కోట్ల విలువైన మందులను పేద ప్రజలకు ఉచితంగా లేదా సాయంగా అందజేయడం విశేషమని అన్నారు.
కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, గంగారంలో అత్యాధునిక వైద్య సేవలు, ఉచిత వైద్య పరికరాల లభ్యత ప్రశంసనీయం అని తెలిపారు. గంగారం గ్రామంలో ప్రైవేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని రీతిలో హాస్పిటల్, అత్యుత్తమ డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అందుబాటులోకి రావడం స్థానిక ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు. ఇటువంటి ఆధునిక ఆస్పత్రులు జిల్లాకు ఒకటి ఉన్నాచాలని, ప్రభుత్వం కూడా భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని అన్నారు.
ఈ సందర్భంగా హాస్పిటల్లోని ఆధునిక పరికరాలు, వేగవంతమైన ల్యాబ్ రిపోర్టుల విధానాన్ని అభినందించారు. పూర్వం HbA1c వంటి పరీక్షల రిపోర్టుల కోసం శాంపిల్స్ బయటకు పంపిస్తే మూడో రోజు వచ్చేదని, కానీ ఇక్కడ కేవలం 10 నిమిషాల్లోనే అత్యాధునిక సాంకేతికతతో అక్యురేట్ రిపోర్టులు వస్తున్నాయని అన్నారు. ఆస్పత్రిలో నాణ్యమైన, విలువైన మందులను రోగులకు అందుబాటులో ఉంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే నిరుపేద రోగులకు ఉచిత వైద్యం ద్వారా నెలకు 3,000 నుండి 4,000 రూపాయల వరకు ఆదా అవుతోందని రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎదుటివారికి సహాయం చేయాలనే మంచి మనస్సు ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి, వారి సోదరుడు మహీల్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ భద్రాచలం పీవో బి. రాహుల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




