Sujathanagar: సుజాతనగర్: విద్యార్థులతో వృద్ధుల పాదపూజ!
Sujathanagar: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పాఠశాలలో సీనియర్ సిటిజన్స్ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు తాత, నానమ్మ, అమ్మమ్మలకు పాదపూజ చేశారు.
Sujathanagar: సుజాతనగర్: విద్యార్థులతో వృద్ధుల పాదపూజ!
Sujathanagar: సీనియర్ సిటిజన్స్ వారోత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడంతో పాటు వృద్ధుల పట్ల గౌరవం, సేవాభావాన్ని పెంపొందించేలా తాత, అమ్మమ్మ, నానమ్మ, తల్లిదండ్రులకు విద్యార్థులతో పాదపూజ చేయించారు. అనంతరం వృద్ధుల సంక్షేమం, గౌరవం కోసం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
పాఠశాల ఉప ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇదే పాఠశాలలో తాము పూర్వ విద్యార్థులుగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, సేవాభావం పెంపొందుతాయని తెలిపారు.
సుజాతనగర్ వైద్యులు పోటు రాఘవరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పెద్దల పట్ల గౌరవం, సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా కుటుంబం, సమాజంలో వృద్ధులను జీవితాంతం ప్రేమ, గౌరవంతో చూసుకుంటామని, వారి జ్ఞానం, అనుభవాలను గౌరవిస్తూ అండగా నిలుస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. వృద్ధులపై జరిగే అన్యాయం, నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ, వారు ఆత్మగౌరవంతో జీవించే సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞలో పేర్కొన్నారు.
కార్యక్రమంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని అభినందించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు పి. వెంకటరమణ, టి. మణి, సీనియర్ సిటిజన్స్ సభ్యులు వి. తిరుపతిరెడ్డి, పి.వి.వి. రాజు, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.




