Palwancha: బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి!
Palwancha: భద్రాద్రి జిల్లాను 2030 నాటికి బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎం. రాజేందర్ పిలుపునిచ్చారు.
Palwancha: బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి!
Palwancha: నవంబర్ 27 జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ బాల్య వివాహ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (AID) సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పాల్వంచ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, బాల్య వివాహ నిరోధక చట్టం–2006 ప్రకారం బాల్య వివాహాలకు పాల్పడిన వారిపై జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించి సమిష్టి కృషి చేస్తే 2030 నాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి తార, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు అంబేద్కర్, జిల్లా ఆరోగ్య అధికారి తుకారం రాథోడ్, జిల్లా విద్యాశాఖ అధికారి శంభు ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక సమస్యలను వివరించి, బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
బాలల సమస్యలపై చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు, అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం అందించాలని తెలిపారు. ఎయిడ్ సంస్థ రాజేష్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా జిల్లాలో గత నాలుగేళ్లుగా బాల్యవివాహాల నిర్మూలన బాలలపై లైంగిక దాడి బాల కార్మిక వ్యవస్థ,
బాలల అక్రమ రవాణాల, బాల్యవివాహాలు పై నిరంతరం క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు పిల్లలకు అందరికీ అవగాహన కల్పిస్తూ బాల్యవివాహ రహిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అందుకు సహకరిస్తున్న జిల్లా స్థాయి అధికారులందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థినులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేసి, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు AID సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ఎం. రాజేందర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్ ఐ రమాదేవి, భరోసా ఎస్ ఐ అరుణ , CMO రామారావు, కళాశాల ప్రిన్సిపాల్, చైల్డ్ లైన్, డీసీపీయూ అధికారులు, కస్తూర్బా విద్యాలయ సిబ్బంది, AID సంస్థ ప్రతినిధులు మోహన్, రవిచంద్ర,మాన్సింగ్, నాగేంద్ర బాబు, జ్యోతి, మౌనిక, 1098 సభ్యులు,ఉమెన్ హబ్ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది మరియు సూపర్ వైజర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.




