Palwancha: పాల్వంచలో వీధి వ్యాపారుల షెడ్ల అక్రమ విక్రయం కలకలం!
Palwancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వీధి వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్ల అక్రమ విక్రయం. షాప్ నంబర్ 12ను రూ.1.50 లక్షలకు విక్రయించినట్లు ఆరోపణలు, సమగ్ర విచారణకు స్థానికుల డిమాండ్.
Palwancha: పాల్వంచలో వీధి వ్యాపారుల షెడ్ల అక్రమ విక్రయం కలకలం!
Palwancha: పేదలైన వీధి వ్యాపారులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నాటి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన షెడ్ల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పాల్వంచ పట్టణంలోని వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో షాప్ నంబర్ 12ను నిన్న సాయత్రం రూ.1.50 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఇరువురి మధ్య బాండ్ కూడా రాసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ నిధులతో వీధి వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్లు ప్రైవేటు వ్యక్తుల మధ్య కొనుగోలు, విక్రయాలకు ఎలా మారుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు షాప్ నంబర్ 12 ఎవరికి కేటాయించారు. ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది..? దాని విక్రయానికి నిబంధనలు అనుమతిస్తున్నాయా. అనే అంశాలపై సంబంధిత కార్పొరేషన్ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఇదే కాకుండా మరికొన్ని షెడ్లను నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అద్దెకు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో వీధి వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్ల కేటాయింపులు, ప్రస్తుత వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
షెడ్లను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడం లేదా ఇతరులకు బదిలీ చేయడం జరిగినట్లు అధికారులు నిర్ధారిస్తే, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రభుత్వ నిధులతో నిర్మించిన వీధి వ్యాపారుల షెడ్లపై వస్తున్న ఆరోపణలపై కార్పొరేషన్ అధికారులు స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.




