Chunchupally: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్!
Chunchupally: చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియను కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Chunchupally: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్!
చుంచుపల్లి: చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నమోదు ప్రక్రియను, లబ్ధిదారుల వివరాల సేకరణ, ఆన్‌లైన్ నమోదు విధానం, నామినీ వివరాల నమోదు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులు ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చని, రేషన్ కార్డు ఆధారంగా వివరాలను నమోదు చేసి నామినీ వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. రేషన్ కార్డులో సభ్యుల వివరాలు అందుబాటులోకి వస్తాయని, కార్డులో సభ్యులు లేని సందర్భాల్లో కూడా ఇతర వ్యక్తులను నామినీగా ఎంపిక చేసుకునే అవకాశం ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
రైతు బీమా, నేతన్న బీమా, గీత కార్మికుల బీమా, మత్స్యకారుల బీమా వంటి ప్రభుత్వ బీమా పథకాల పరిధిలో ఇప్పటికే ఉన్నవారి వివరాలను కూడా నమోదు ప్రక్రియలో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. నమోదు పూర్తయిన అనంతరం లబ్ధిదారులకు రసీదు అందజేయడంతో పాటు ట్రాన్సాక్షన్ ఐడీ, ఎన్రోల్‌మెంట్ నంబర్, బీమా పొందే వ్యక్తి వివరాలు, నామినీ పేరు, వారితో ఉన్న సంబంధం తదితర వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసి లబ్ధిదారుల సంతకాలు తీసుకోవాలని తెలిపారు.
గ్రామాల వారీగా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రుద్రంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో సుమారు 1,250 రేషన్ కార్డులు ఉండగా, మొదటి రోజు 65 మందికి సంబంధించిన వివరాలను నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి నమోదు ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. బీమా నమోదు ప్రక్రియలో ఏవైనా సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. నమోదు శిబిరాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, నమోదు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం నమోదు ప్రక్రియ పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నమోదు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో సుభాషిని, పంచాయతీ సెక్రటరీ, సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




