Kothagudem: రైతుల డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం
Kothagudem: కొత్తగూడెంలో రైతు డిజిటల్ రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని DRO పద్మావతి ఆదేశం. ఫార్మర్ ఐడీతో ప్రభుత్వ పథకాలు, పంట రుణాలు పొందవచ్చని వెల్లడి.
Kothagudem: రైతుల డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం
కొత్తగూడెం: జిల్లాలో అగ్రిస్టాక్ యాప్ ద్వారా చేపడుతున్న రైతు రిజిస్ట్రీ, డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేసి వందశాతం లక్ష్యాన్ని సాధించాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కార్యక్రమం పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 1.85 లక్షల మంది రైతులకు గాను ఇప్పటివరకు సుమారు 1.39 లక్షల మంది రైతుల రిజిస్ట్రేషన్ పూర్తయిందని, మరో 45 వేల మంది నమోదు కావాల్సి ఉందని తెలిపారు. మిగిలిన రైతులందరి వివరాలను నమోదు చేసి లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
డిజిటల్ క్రాప్ బుకింగ్‌లో భాగంగా గ్రామస్థాయిలో వాలంటీర్ల ద్వారా పంటల ఫొటోలు సేకరించి, సాగు విస్తీర్ణం, పంటల వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నట్లు వివరించారు.
డీఆర్ఓ పద్మావతి మాట్లాడుతూ.. రైతులకు పంట రుణాలు, పంటల బీమా, ధాన్యం, మొక్కజొన్న, పత్తి తదితర పంటల కొనుగోలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టపరిహారం అందించడంలో ఫార్మర్ ఐడీ కీలకంగా ఉంటుందని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు, డ్రిప్ ఇరిగేషన్, ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతలు, రీఛార్జ్ పిట్స్ వంటి ప్రభుత్వ పథకాల అమలులోనూ రైతు ఐడీ ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.
రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్‌తో సమీపంలోని మీసేవ, కామన్ సర్వీస్ సెంటర్లు, మండల వ్యవసాయ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. రైతులకు ఫార్మర్ ఐడీ ప్రాధాన్యతపై అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
సమావేశంలో సీపీఓ సునీత, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావుతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పౌరసరఫరాలు, మార్కెటింగ్, ఐటీడీఏ, గిరిజన సంక్షేమం, నాబార్డ్, పశుసంవర్ధక, సహకార, డీఆర్డీఏ తదితర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.




