Kothagudem: ‘ఫిట్ కాప్’ యాప్ వినియోగంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో 'ఫిట్ కాప్' (Fit Cop) యాప్ వినియోగంపై పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
Kothagudem: ‘ఫిట్ కాప్’ యాప్ వినియోగంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ!
Kothagudem: తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్య పరిరక్షణను లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ మరియు ఇతర సంస్థల సహకారంతో రూపొందించిన ‘ఫిట్ కాప్’ (Fit Cop) యాప్ వినియోగంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం హేమచంద్రపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొనే పని ఒత్తిడి, అధిక పని భారం కారణంగా తమ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపలేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఫిట్ కాప్ యాప్‌లో పోలీసు అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత ఆరోగ్య వివరాలను ఏ విధంగా నమోదు చేయాలి, ఫిజికల్ చెకప్‌కు సంబంధించిన రీడింగ్స్‌ను ఏ విధంగా తీసుకోవాలి, వాటిని యాప్‌లో ఎలా నమోదు చేయాలనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు (బీపీ), శరీర ద్రవ్యరాశి సూచీ (BMI), ఇతర ఆరోగ్య సమస్యలు, జీవనశైలి అలవాట్లు, శారీరక వ్యాయామం, తదితర వివరాలను నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి మాట్లాడుతూ, ఫిట్ కాప్ యాప్ ద్వారా పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు, ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన వైద్య సలహాలు, చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. శిక్షణ పొందిన సిబ్బంది తమ తమ పోలీస్ స్టేషన్లలోని ఇతర సిబ్బందికి కూడా యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు.పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు దోహదపడే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు రాము, రమాకాంత్, ఇంద్రసేనారెడ్డి, నాగబాబు, ఎల్లయ్య, కరుణాకర్, సురేష్, నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నరసింహారావు, లాల్ బాబు, కృష్ణారావు, పోలీస్ అధికారులు, టెక్ టీం సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




