Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Kothagudem: కొత్తగూడెం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 21 Oct 2026 2:53 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Kothagudem: పోలీస్ అమరవీరుల త్యాగాలు పోలీస్ శాఖకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం కొత్తగూడెం హేమచంద్రాపురంలోని జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అమరవీరుల స్తూపం వద్ద ఆయన పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం సాయుధ పోలీసులు ‘శోక్ శస్త్ర’ నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరవీరులను స్మరించుకున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది పేర్లను ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ చదివి వినిపించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణాలర్పించిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైన్యంతో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన పది మంది పోలీసుల త్యాగాలకు గుర్తుగా 1962 నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

2025 సెప్టెంబర్ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 154 మంది పోలీస్ సిబ్బందిని స్మరించుకోవడం మనందరి బాధ్యతని, వీరిలో తెలంగాణకు చెందిన నలుగురు ఉన్నారని వెల్లడించారు. దేశ భద్రత, అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో పోలీసుల పాత్ర కీలకమని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీష్ కుమార్, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య నాయక్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM