Kothagudem: కొత్తగూడెంలో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్!
Kothagudem: సైబర్ నేరాలపై అవగాహన కోసం కొత్తగూడెంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫ్లాష్ వాక్. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్ రాజు విజ్ఞప్తి.
Kothagudem: కొత్తగూడెంలో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్!
Kothagudem: సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెంలో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్ నిర్వహించారు. పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు కొనసాగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా మోసాలు, ఆన్‌లైన్ వేధింపులు, నకిలీ ఖాతాలు, డిజిటల్ అరెస్ట్, ఆన్‌లైన్ పెట్టుబడులు, లోన్ యాప్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు వెల్లడించవద్దని, వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, కుటుంబ వివరాలు, సున్నితమైన సమాచారాన్ని పంచుకునే విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ 'ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించుకోండి' అనే సూత్రాన్ని పాటించాలని తెలిపారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థులు, యువత సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సీఐలు నరేష్, జితేందర్, వెంకటేశ్వర్లు, యాసీన్, ఇంద్రసేనారెడ్డి, పోలీస్ అధికారులు, సైబర్ వారియర్స్, సిబ్బంది, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.




