Kothagudem: నాణ్యమైన దర్యాప్తుతో శిక్షలు పడాలి: ఎస్పీ రోహిత్ రాజు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో నెలవారీ నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్, గంజాయి కట్టడి, నాణ్యమైన దర్యాప్తుపై ఆదేశాలు జారీ చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 8 Oct 2026 6:16 PM IST
Kothagudem
X

Kothagudem: నాణ్యమైన దర్యాప్తుతో శిక్షలు పడాలి: ఎస్పీ రోహిత్ రాజు!

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అధ్యక్షతన నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నేర పరిస్థితులు, పెండింగ్ కేసులు, కేసుల దర్యాప్తు పురోగతి తదితర అంశాలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించి కఠిన సేవ, సేవ, ఉత్తమ సేవ, శౌర్య పతకాలు పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ పతకాలను అందజేసి అభినందించారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

అనంతరం నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నేరస్తులకు శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో జాప్యం, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, బాధ్యతారహితంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.

మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భరోసా కేంద్రం, షీ-టీమ్స్ ద్వారా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మహిళలపై నేరాలు, పోక్సో, ఎస్సీ/ఎస్టీ కేసులు, మిస్సింగ్ కేసులతో పాటు రౌడీ షీట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గంజాయి వినియోగానికి అలవాటు పడిన వ్యక్తులను గుర్తించి, వైద్యుల సూచనల మేరకు డి-అడిక్షన్ సెంటర్లకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువత, విద్యార్థులు, ప్రజలకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయానికి సంబంధించిన హాట్‌స్పాట్లను గుర్తించి నిరంతరం నిఘా కొనసాగించాలని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సైబర్ నేరాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని, సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలవాలని తెలిపారు. సైబర్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు సీసీటీఎన్ఎస్ 2.0లో పెండింగ్ వివరాలను సకాలంలో నమోదు చేయాలని, నాట్ గ్రిడ్, గాండీవ వెబ్ అప్లికేషన్ల వినియోగాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు.

జిల్లాలో సీసీటీవీ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసి కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. డయల్-112కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ తదితర ఉల్లంఘనలపై నిరంతరం వాహన తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని, నేరాల నియంత్రణతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్‌తో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM