Singareni: సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. నవంబర్ 5న బోనస్ చెల్లింపు!

Singareni: సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా పీఎల్‌ఆర్ బోనస్ ప్రకటించిన ప్రభుత్వం. ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 నవంబర్ 5న జమ.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 30 Oct 2026 5:07 PM IST
Singareni
X

Singareni: సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. నవంబర్ 5న బోనస్ చెల్లింపు!

Singareni: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే దసరా సందర్భంగా లాభాల వాటా బోనస్ అందుకున్న కార్మికులకు తాజాగా దీపావళి కానుకగా పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ బోనస్ (పీఎల్ఆర్) ప్రకటించింది. నవంబర్ 5వ తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో దీపావళి బోనస్ జమ చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

ఈ మేరకు శుక్రవారం సింగరేణి ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు. మొత్తం సుమారు రూ.419 కోట్లను దీపావళి బోనస్ రూపంలో చెల్లించనున్నట్లు తెలిపారు. అర్హులైన ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 అందనున్నాయి. ఈ నిర్ణయంతో సుమారు 38 వేల మంది సింగరేణి కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది.

నెల రోజుల్లోనే రూ.2.65 లక్షల వరకు ప్రయోజనం

ఇప్పటికే లాభాల వాటా కింద ఈ నెలలో దాదాపు రూ.600 కోట్లను కార్మికులకు చెల్లించిన ప్రభుత్వం, తాజాగా మరో రూ.419 కోట్ల దీపావళి బోనస్ ప్రకటించింది. దీంతో నెల రోజుల వ్యవధిలోనే దసరా, దీపావళి బోనస్‌ల రూపంలో సగటున ఒక్కో కార్మికుడికి సుమారు రూ.2.65 లక్షల వరకు అందనున్నాయి. ఈ రెండు బోనస్‌ల కోసం కలిపి సింగరేణి యాజమాన్యం సుమారు రూ.1,020 కోట్లను వెచ్చిస్తోంది.

ఎన్‌సీడబ్ల్యూఏ కార్మికులకే వర్తింపు

దీపావళి బోనస్ కేవలం ఎన్‌సీడబ్ల్యూఏ పరిధిలోని కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. సంస్థ అధికారులకు ఈ బోనస్ వర్తించదు. గత ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల్లో 190 పని దినాలు, ఓపెన్‌కాస్ట్, సర్ఫేస్ విభాగాల్లో 240 పని దినాలు పూర్తి చేసిన వారికి పూర్తి బోనస్ అందుతుంది. అంతకంటే తక్కువ రోజులు పనిచేసిన వారికి వారు విధులు నిర్వహించిన రోజుల ఆధారంగా నిష్పత్తి ప్రకారం బోనస్ చెల్లిస్తారు. అయితే బోనస్ పొందేందుకు కనీసం 30 పని దినాల హాజరు తప్పనిసరి.

చెల్లింపులకు సీఎండీ ఆదేశాలు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సంబంధిత పర్సనల్, ఫైనాన్స్ అధికారులతో మాట్లాడి నవంబర్ 5న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో బోనస్ జమ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎండీ కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. బోనస్ సొమ్మును కుటుంబ అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు వీలైనంత మేర పొదుపు చేసుకోవాలని సూచించారు. పండుగ స్ఫూర్తితో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తూ గనుల వారీగా, శాఖల వారీగా నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కోరారు.

రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న సింగరేణి అభివృద్ధి, విస్తరణకు ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బొగ్గు రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ సంస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.