Kothagudem: గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి: ఎస్ఎఫ్‌ఐ, కేవీపీఎస్
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఎస్ఎఫ్‌ఐ, కేవీపీఎస్ వినతిపత్రం ఇచ్చాయి.
Kothagudem: గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి: ఎస్ఎఫ్‌ఐ, కేవీపీఎస్
Kothagudem: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) , కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న గురుకులాలకు సొంత సొంత భవనాలు కేటాయించాలని, జిల్లా వ్యాప్తంగా గురుకులాలలో ఖాళీగా ఉన్న డిగ్రీ లెక్చరర్లు , జూనియర్ లెక్చరర్లు , పిజిటి టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర SC ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద నాగక్రిష్ణ , కెవిపిఎస్ జిల్లా నాయకులు నందిపాటి రమేష్ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద నాగక్రిష్ణ, కెవిపిఎస్ జిల్లా నాయకులు నందిపాటి రమేష్ మాట్లాడుతూ జిల్లాలో గురుకులాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాలలో కొనసాగిస్తున్నారని గురుకులాల విద్యను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు గాలికి వదిలేశారని వాపోయారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిగ్రీ కళాశాల సొంత భవనాల నిర్మాణం కోసం ఒక్కొక్క కళాశాలకు 32 కోట్ల రూపాయలు , జూనియర్ కళాశాలకు సొంత భవనాల నిర్మాణం కోసం ఒక్కొక్క 23 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తూ జి ఓ నెంబర్ 20ని తీసుకొని వచ్చింది.
ఈ క్రమంలోనే జిల్లాలో సాంఘీక సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాలకు లక్ష్మీదేవిపల్లి మండలంలోని రామచంద్ర డిగ్రీ కళాశాల వద్ద 10 ఎకరాల స్థలం కేటాయించారు. ఇక్కడ ఎటువంటి నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం ఈ డిగ్రీ కళాశాల పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల నిర్వహిస్తున్నారని అన్నారు. ఇందుకుగాను 7 లక్షలు అద్దె చెల్లిస్తున్నారని ఒక సంవత్సరానికి 84 లక్షలు అద్దె చెల్లిస్తున్నారని అన్నారు. అదేవిధంగా మణుగూరులో గురుకుల జూనియర్ కళాశాలకు 5 ఎకరాల స్థలం కేటాయించారని ఇక్కడ కూడా నిర్మాణం చేపట్టలేదని అన్నారు.
ప్రభుత్వం స్థలాలు కేటాయించబడి నిర్మాణం చేయని కారణంగా ప్రతి సంవత్సరం రెండు కోట్లకు పైగా అద్దెలు చెల్లిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు అన్నారు. ఇదే డబ్బుతో శాశ్వత భవనాలు నిర్మిస్తే విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన సౌకర్యాలతో మంచి విద్యాబోధన చేయవచ్చు అని వారన్నారు. కళాశాలలను అర్థ భవనాల్లో నిర్వహించడం ద్వారా విద్యార్థులకు అరకోర వసతులతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజీలో భవనంలో నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలలో పక్కనే ఉన్న కేటీపీఎస్ నుండి వెదజల్లుతున్న యాష్ బూడిద కారణంగా మరియు పొగ కాలుష్యం వలన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చర్మవ్యాధులు ,శ్వాసకోశ వ్యాధులు, జుట్టి రాలిపోవడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారు.
కాబట్టి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా కేటాయించిన స్థలంలో సొంత భవనాలు నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 గురుకులాల్లో ఖాళీగా ఉన్న డిగ్రీ, జూనియర్ కళాశాల లెక్చరర్స్ , పిజిటి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు టీచర్స్ లెక్చరర్స్ లేరని ఇలా సరిపడా ఉపాధ్యాయులు లేని కారణంగా విద్యార్థులు విద్యను అభ్యసించడంలో తీవ్రంగా వెనుకబడి పోతున్నారని వారు అన్నారు.
తక్షణమే ఖాళీగా ఉన్న డిగ్రీ లెక్చరర్స్ 5 పోస్టులు , 17 జూనియర్ లెక్చరర్స్ పోస్టులు, 27 పిజిటి టీచర్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని వారు అధికారులను డిమాండ్ చేశారు కాళీ పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు , రిక్రూట్మెంట్ కోసం జిల్లా కలెక్టర్ గారు ఆరుగురు అధికారుల తోటి కమిటీ నియమించారు ఈ కమిటీ పర్యవేక్షణలో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులందరికీ డెమో క్లాసులు నిర్వహించారు.
ఈ ప్రక్రియ పూర్తయి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. నాలుగు నెలలుగా పూర్తిస్థాయిలో క్లాసులు జరగక పేద దళిత విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని వారు వాపోయారు.
చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు పాఠాలు జరగనందున టిసిలు ఇవ్వాలని మా పిల్లలను మరోచోట చేర్పించుకుంటామని వారు చెబుతున్నారు పిల్లల చదువులకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా సకాలంలో లెక్చరర్ టీచర్ల పోస్టుల భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహించిన ఫలితంగా దళిత విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు.
కాబట్టి ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు మేకల కనకయ్య , ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు తేజ హర్ష తదితరులు పాల్గొన్నారు.




