Sathupally: బేతుపల్లి చెరువులో రక్షణ బోట్లు బోల్తా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు!
Sathupally: ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువు అలుగు వద్ద ఎస్డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా పడి సిబ్బంది కొట్టుకుపోవడంతో కలెక్టర్ పర్యవేక్షణలో గాలింపు చర్యలు సాగుతున్నాయి.
Sathupally: బేతుపల్లి చెరువులో రక్షణ బోట్లు బోల్తా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు!
Sathupally: సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి చెరువులో వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండ ఆరో బెటాలియన్‌కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద ఉధృతికి ప్రమాదానికి గురయ్యారు. చెరువు అలుగు వద్ద రెండు రక్షణ బోట్లు బోల్తాపడటంతో సిబ్బంది తమ్మిలేరు వాగులో కొట్టుకుపోవడం కలకలం రేపింది.
బుధవారం మధ్యాహ్నం బేతుపల్లి చెరువులో చేపలు కొట్టుకుపోకుండా వలలు కట్టేందుకు ఏడుగురు మత్స్యకారులు చెరువు అలుగు వద్దకు వెళ్లారు. అయితే ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో వారు నీటిలో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని సాయంత్రం అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు వెంటనే స్పందించి మత్స్యకారులను రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు.
తొలుత చేపట్టిన సహాయక చర్యల్లో రామనగరానికి చెందిన బొందల రమేష్‌తో పాటు మరో మత్స్యకారుడిని సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం మిగిలిన వారిని రక్షించేందుకు రెండు బోట్లలో ఒకదానిలో ఐదుగురు, మరోదానిలో ఆరుగురు చొప్పున మొత్తం 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చెరువులోకి వెళ్లారు.
ఈ క్రమంలో చెరువు అలుగు వద్దకు బోట్లు చేరుకోగానే ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో రెండు బోట్లు బోల్తాపడ్డాయి. దీంతో బోట్లలో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ్మిలేరు వాగు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై తమ్మిలేరు వాగు పరిసర ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ప్రత్యక్షంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.




