Sathupally: సత్తుపల్లిలో రూ.2 కోట్లతో ఇండోర్ స్టేడియం మంత్రి పొంగులేటి
Sathupally: సత్తుపల్లిలో రూ. 2 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. క్రీడలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
Sathupally: సత్తుపల్లిలో రూ.2 కోట్లతో ఇండోర్ స్టేడియం మంత్రి పొంగులేటి
సత్తుపల్లి: ప్రజా ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి, ప్రోత్సహిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి సత్తుపల్లి పట్టణంలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా నూతన స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చి, ఫోర్త్ సిటీ లో అద్భుతమైన స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్రీడలపై ఆసక్తి చూపే యువతీ యువకులను ప్రోత్సహించేందుకు, పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలు అందించి ప్రోత్సహిస్తున్నామన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ విద్య, వైద్యం, క్రీడా రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. సత్తుపల్లి ఇండోర్ స్టేడియం సాధన కోసం పదే పదే కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ను, వారి సేవలను ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సత్తుపల్లి నియోజకవర్గం రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచే మొదటి నియోజకవర్గంగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, సత్తుపల్లి అభివృద్ధికి మంత్రి అందిస్తున్న సహకారం, తోడ్పాటు ఎంతో అమూల్యమని అన్నారు. భవిష్యత్తులోనూ ఆయన నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి టీ. సునీల్ రెడ్డి, సత్తుపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్ పాషా, కమీషనర్ నర్సింహా, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




